Begin typing your search above and press return to search.

ఇద్దరి మధ్య ఇరుక్కుపోయారా ?

By:  Tupaki Desk   |   2 Jun 2021 8:30 AM GMT
ఇద్దరి మధ్య ఇరుక్కుపోయారా ?
X
ఆబోతుల మధ్యలో లేగదూడ ఇరుక్కుపోయిందనే నానుడి నిజమయ్యేట్లే ఉంది పశ్చిమబెంగాల్ విషయంలో. ప్రథానమంత్రి నరేంద్రమోడి-ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో చివరకు చీఫ్ సెక్రటరీ ( సీఎస్) (రిటైర్డ్ ?) ఆలాపన్ బందోపాధ్యాయ ఇరుక్కుపోయారు. విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అనే సామెతలో లాగ అయిపోయింది సీఎస్ వ్యవహారం. విపత్తు నిర్వహణ చట్టం కింద ఆలాపన్ కు కేంద్రం తాజాగా షోకాజ్ నోటీసివ్వటం సంచలనంగా మారింది.

తన సమీక్షకు మమతతో పాటు సీఎస్ కూడా ఆలస్యంగా హాజరయ్యారని సీఎస్ పై మోడి మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళిపోయిన వెంటనే సీఎస్ ను కేంద్రానికి బదిలీచేశారు. అయితే అప్పటికే బెంగాల్ సీఎస్ కు మూడునెలల సర్వీసు పొడిగింపు ఆర్డర్ అందుకున్న ఆలాపన్ కు తాజా ఉత్తర్వులు షాకిచ్చింది. అయితే సీఎస్ బదిలీ ఆర్డర్ ను మమత అడ్డుకున్నారు. సీఎస్ గా ఆలాపన్ కు కేంద్రం నుండి వేధింపులు తప్పవన్న ఉద్దేశ్యంతో ఆయనతో రాజీనామా చేయించారు. ఆ వెంటనే తనకు సలహాదారుగా నియమించేసుకున్నారు.

అంటే టెక్నికల్ గా ఆలాపన్ ఇపుడు అఖిల భారత్ సర్వీసు అధికారి కాదు. రిటైర్డ్ ఐఏఎస్ గానే పరిగణించాలి. కానీ అందుకు కేంద్రం అంగీకరించలేదు. తాను బదిలీ ఉత్తర్వులు ఇచ్చినపుడు ఆలాపన్ సీఎస్ గా ఉన్నారు కాబట్టి ఢిల్లీకి రావాల్సిందే అని పట్టుబట్టింది. ఎట్టిపరిస్ధితుల్లోను ఆలాపన్ను ఢిల్లీకి పంపేదిలేదని మమత కూడా గట్టిగా సమాధానమిచ్చింది. ఈ నేపధ్యంలోనే చివరకు ఆలాపన్ కు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద షోకాజ్ నోటీసిచ్చింది.

డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం చాలా కఠినమైనదని అంటున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెండేళ్ళు జైలుశిక్ష తప్పదట. ఇప్పుడు వ్యవహారం ఎలాగుందంటే ఇటు నరేంద్రమోడి అటు మమత బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఆలాపన్ నలిగిపోతున్నారు. కేంద్ర వ్యవహారమంతా అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుగా ఉందనే ఆరోపణలు పెరిగిపోతోంది. మమతపై ఎలాంటి చర్యలు తీసుకోలేని కేంద్రం ఆ కోపాన్ని ఆలాపన్ పై చూపిస్తోందనే విషయం అర్ధమైపోతోంది. మరి చివరకు ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.