Begin typing your search above and press return to search.

మోడీ నేర్పిన విద్యను నేర్చుకొని ఆయనకే దీదీ ట్యూషన్?

By:  Tupaki Desk   |   2 Jun 2021 6:30 AM GMT
మోడీ నేర్పిన విద్యను నేర్చుకొని ఆయనకే దీదీ ట్యూషన్?
X
నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్న సామెతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మోడీ - మమత ఎపిసోడ్ నడుస్తోందని చెప్పాలి. నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా అన్నట్లు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. దేశ పాలనను వదిలిపెట్టి పశ్చిమ బెంగాల్ లో అధికారాన్ని సొంతం చేసుకుంటే చాలన్నట్లుగా ప్రధాని మోడీ మోడీ వ్యవహరిస్తే.. దీదీని నమ్మి ఆమెకు బంపర్ మెజార్టీతో అధికారాన్ని బెంగాలీలు ముచ్చటగా మూడోసారి అప్పజెబితే.. ఆ విషయాన్ని వదిలేసి మోడీకి షాకులు ఇచ్చే పనిలో బిజీ అయ్యారు మమతమ్మ.

యస్ తుపాను సమీక్ష కోసం వచ్చిన ప్రధాని మోడీకి తనదైన మర్యాదలు చేసి షాకులిచ్చిన వైనం సంచలనంగా మారారు. అసలు ముక్కోపి.. అంతకు మించిన మొండితనం మూర్తీభవించిన మమతమ్మ.. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలన్నింటికి చక్రవడ్డీ వసూలు చేయాలన్నట్లుగా ఆమె తీరు ఉందని చెప్పాలి. అయితే.. తప్పంతా మమతదే అని చెప్పటం తప్పే అవుతుంది. ఈ విషయంలో ప్రధాని మోడీ తీరును సైతం తప్పు పట్టాల్సిందే.

ఇటీవల కాలంలో మరే ప్రధానమంత్రి చేయని విధంగా.. కొన్ని రాష్ట్రాల విషయంలో మోడీ అనుసరించిన వైఖరిని తప్పు పట్టాల్సిందే. విచారణ సంస్థలను వాడేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మించినట్లుగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థలకు వ్యవస్థల్ని తన అదుపులో ఉండేలా మోడీ వ్యవహరించే తీరును కొందరు తీవ్రంగా తప్పుపడుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము టార్గెట్ చేస్తే.. ఎవరైనా సరే తాము చెప్పినట్లుగా ఉండాలన్నట్లుగా మోడీషాల తీరును పలువురు తూర్పార పడతారు. ఏడేళ్లు ప్రధానిగా వ్యవహరించిన మోడీ.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో అధికార బదిలీ విషయంలో వారు వ్యవహరించిన తీరు దేశ రాజకీయాలకు కొత్త పాఠాలు నేర్పేలా చేసిందని చెబుతారు.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. మోడీ ఓఎస్ ను మమతమ్మ బాగానే క్రాక్ చేశారని చెప్పాలి. ప్రధాని హోదాలో రివ్యూకు వచ్చిన మోడీని.. ముఖ్యమంత్రి హోదాలో మమతమ్మ ఎంతటి షాకిచ్చారో తెలిసిందే. చివరకు మోడీ అంతటి నేత సైతం.. జరుగుతున్న పరిణామాల్ని జీర్ణించుకోలేని పరిస్థితి. కేంద్ర సర్వీసులకు చెందిన అధికారిని ప్రధానిని వదిలేసి.. తన వెంట వచ్చేలా చేసుకోవటం విస్మయంగా మారింది. ఆయనపై చర్యలు చేపడితే.. ఆయన సీఎస్ పదవికి రాజీనామా చేయించి.. రాష్ట్ర సలహాదారుగా పోస్టులో కూర్చోబెట్టిన వైనం ఇప్పుడు మోడీ పరివారానికి ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది. మొత్తం పరిణామాల్ని చూసినప్పుడు.. దేశ రాజకీయాలకు మోడీ నేర్పిన విద్యను ఆయనకే స్పెషల్ క్లాసులు చెప్పేంతలా దీదీ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. వీరిద్దరి మధ్య రచ్చకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో?