Begin typing your search above and press return to search.

నా త‌ల్లి పుట్టిన తేదీ తెలియ‌దు..మోదీపై మ‌మ‌త ఫైర్‌

By:  Tupaki Desk   |   26 Dec 2019 10:40 PM IST
నా త‌ల్లి పుట్టిన తేదీ తెలియ‌దు..మోదీపై మ‌మ‌త ఫైర్‌
X
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గారూ మీ పని దేశానికి నిప్పుపెట్టడం కాదు.. నిప్పును చల్లార్చడం’ అని ధ్వజమెత్తారు. ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌' అనేది తమ విధానమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ‘సబ్‌ కా సర్వనాశ్‌' కు పాల్పడిందని విమర్శించారు. ‘పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తోపాటు ఎన్నార్సీ అమలు విషయమై వేదికలపై నేను - ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బహిరంగమే. దేశాన్ని విభజించే సూత్రంతో దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామని హోంమంత్రి (అమిత్‌ షా) బహిరంగంగా చేసిన ప్రకటనతో ప్రధాని విబేధిస్తున్నారు. ఎవరు చెప్పేది నిజమో? తప్పో? ప్రజలే తేలుస్తారు’ అని ట్వీట్‌ చేశారు.

బాబ్రీ మ‌సీదు త‌ర్వాత ప‌రిస్థితులు దేశంలో ఉన్నాయ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైనప్పుడు దేశంలో కొంత అశాంతి నెలకొంది. తర్వాత పరిస్థితులు సద్దుమణిగి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ వాళ్లు (బీజేపీ నేతలు) మళ్లీ అధికారంలోకి వచ్చాక దేశంలో అశాంతి నెలకొంది.` అని పేర్కొన్నారు. తన తల్లి పుట్టిన తేదీ - పుట్టిన స్థలం గురించి తనకు తెలియదని.. అలాంటప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మీరెలా చెబుతారని ప్రశ్నించారు. `ఎన్నార్సీని - సీఏఏను పశ్చిమబెంగాల్‌ లో అమలు చేయను. ఈ రెండిటిని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. బలవంతంగా అమలు చేయాలని చూస్తే.. ఎట్లా అమలు చేస్తారో నేను కూడా చూస్తా’ అని సవాల్‌ విసిరారు.

ఈ సందర్భంగా మమత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. `నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎన్నార్సీ - సీఏఏను రాష్ట్రంలో అమలు చేయబోను. మీరు కావాలనుకుంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. నన్ను జైల్లో పెట్టినా సరే కేంద్రానికి లొంగేది లేదు. ఈ నల్ల చట్టాలను నేను ఎప్పటికీ అమలు చేయను. ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగిస్తా అని చెప్పారు. ఇతరులకు సలహా ఇచ్చే ముందు ఈశాన్యంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితిని కేంద్రం గమనించాలని ఎద్దేవా చేశారు. ఎన్నార్సీపై గళమెత్తినప్పుడు తాము ఒంటరిగా ఉన్నామని - ఇప్పుడు ఢిల్లీ - బీహార్ - మధ్యప్రదేశ్ - పంజాబ్ - ఛత్తీస్‌ గఢ్ - కేరళ వంటి ఇతర రాష్ర్టాల సీఎంలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మమత చెప్పారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసుల దాడిని మమత ఖండించారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) అమలు చేసే విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ - కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వైఖరితో బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.