Begin typing your search above and press return to search.

టామ్ అండ్ జెర్రీ: మమత vs గవర్నర్ మళ్లీ మొదలైంది?

By:  Tupaki Desk   |   29 Jun 2021 5:32 AM GMT
టామ్ అండ్ జెర్రీ: మమత vs గవర్నర్ మళ్లీ మొదలైంది?
X
కరవకంటే పాముకు కోపం.. విడవకంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైంది బెంగాల్ లో సీఎం, గవర్నర్ల పరిస్థితి. ఇద్దరూ మొండి ఘటాలే.. పంతాలకు వారసులే.. వారి వల్ల ఇప్పుడు అక్కడ రాజ్యాంగ, ప్రభుత్వాల పరువులు గంగపాలవుతున్నాయి. పరస్పర విమర్శలు, చర్యలతో రచ్చ రంబోలా అవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, గవర్నర్ లు ఇద్దరూ ఉప్పూ నిప్పుల చిటపటలాడుతూనే ఉంటారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న మమతా బెనర్జీని.. కేంద్రం నియమించిన గవర్నర్ ప్రతీసారి అడ్డుకుంటూనే ఉంటున్నారు. తాజాగా మరోసారి వీరి మధ్య వివాదం చెలరేగింది.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. సీఎం మమత ఆరోపణలతో తాను షాక్ కు గురయ్యానని వాపోయారు. గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ పై మమతా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గవర్నర్ పచ్చి అవినీతి పరుడు అని మమతా బెనర్జీ ఆరోపించడం సంచలనమైంది. బెంగాల్ విభజనకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.

బెంగాల్ సీఎం మమత తాజాగా విలేకరుతో మాట్లాడారు. ‘1996 నాటి జైన్ హవాలా కేసు అభియోగపత్రంలో బెంగాల్ గవర్నర్ పేరు ఉంది. అలాంటి వ్యక్తిని కేంద్రప్రభుత్వం ఎందుకు గవర్నర్ కొనసాగిస్తోంది. కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు , ఎంపీలనే కలుస్తున్నారు. ఆయన ఆకస్మికంగా ఉత్తర బెంగాల్ కు ఎందుకు వెళ్లారు? ఉత్తర బెంగాల్ విభజనకు కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది’ అని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక తన పాత కేసులు తవ్వుతున్న మమతా బెనర్జీ తీరుకు గవర్నర్ షాక్ తిన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సీఎం ఇలా విరుచుకుపడడం ఏంటని వాపోయారు. మమత చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆరోపించడం తానెప్పుడూ చూడలేదన్నారు.

మమతా బెనర్జీ ఆరోపనలపై గవర్నర్ వివరణ ఇచ్చారు. ఏ చార్జీషీట్ లోనూ తన పేరు లేదన్నారు. ఏ కోర్టు నుంచి కూడా తాను స్టే తీసుకోలేదన్నారు. సీఎం మమతా నుంచి ఇలాంటి ఆరోపనలు ఊహించలేదని వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు తనకు షాక్ కు గురి చేశాయన్నారు. ఇలా టామ్ అండ్ జెర్రీలా వీరి ఫైట్ బెంగాల్ లో రాజకీయ వేడిని రగిలిస్తోంది.