Begin typing your search above and press return to search.

భోజ‌నం.. నిద్ర మానేసి మ‌రీ దీక్ష చేస్తున్న దీదీ!

By:  Tupaki Desk   |   4 Feb 2019 12:34 PM IST
భోజ‌నం.. నిద్ర మానేసి మ‌రీ దీక్ష చేస్తున్న దీదీ!
X
ద‌దీ అంటూ ప్రేమగా పిలిస్తే కరిగిపోయే త‌త్త్వం. నువ్వెంత? అన్న ప్ర‌శ్న ఎవ‌రి నోటి నుంచైనా వ‌చ్చిందా? అంతే.. దీదీ కాస్తా ద‌డ పుట్టించే అగ్గి బ‌రాఠాలా మారిపోతారు. అదే.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గొప్ప‌త‌నం. త‌న‌కు తానుగా ఎవ‌రి జోలికి రాని ఆమె..ఒక‌సారి డిసైడ్ అయితే మాత్రం మొండిత‌నానికి సైతం పాఠాలు నేర్పేలా ఆమె వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

ఇవాల్టి రోజున ప్ర‌ధాని మోడీతో పెట్టుకోవటానికి కొమ్ములు తిరిగిన రాజ‌కీయ అధినేత‌లు సైతం గ‌జ‌గ‌జా వ‌ణుకుతున్న ప‌రిస్థితి. అలాంటి వేళ‌.. దీదీ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. మోడీషాల‌కు దిమ్మ తిరిగిపోయేలా వ్య‌వ‌హ‌రిస్తూ.. కొత్త స‌న్నివేశాల్ని సృష్టిస్తున్నారు.

శార‌ద స్కాంలో కోల్ క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను ప్ర‌శ్నించేందుకు ఢిల్లీ నుంచి వ‌చ్చిన సీబీఐ అధికారుల్ని అడ్డుకోవ‌ట‌మే కాదు..వారిని పోలీసు జీపులో పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లిన కోల్ క‌తా పోలీసుల తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. ఆరాష్ట్రానికి దూసుకెళ్లి చుక్క‌లు చూపించే సీబీఐ అధికారుల్లో జంకు పుట్టేలా దీదీ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. త‌మ పోలీసు ఉన్న‌తాధికారి మీద ఒత్తిడి తెచ్చేందుకు.. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని భావించిన దీదీ అసాధార‌ణ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను క‌లిసి.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన దీదీ.. నేరుగా వ‌చ్చి రాత్రి వేళ రోడ్డు మీద నిర‌స‌న దీక్ష‌కు కూర్చున్నారు. ఆదివారం రాత్రంతా భోజ‌నం మానేసిన ఆమె..క‌నీసం నిద్ర పోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ ఉద‌యం కూడా త‌న దీక్ష‌ను ఆమె కొన‌సాగిస్తున్నారు.

భోజ‌నం.. నిద్ర లేకుండా మ‌మ‌త చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున దీక్షా స్థ‌లికి చేరుకుంటున్నారు. సీబీఐ అధికారుల తీరును.. కేంద్రం ధోర‌ణిని ప్ర‌శ్నిస్తున్న ఆమె.. మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఆమె.. త‌న స‌త్యాగ్ర‌హ దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న అధినేత నేరుగా దీక్ష‌కు దిగ‌టంతో కోల్ క‌తా మ‌హాన‌గ‌రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌రోవైపు.. ఈ అంశంపై సుప్రీంకోర్టునుఆశ్ర‌యించిన సీబీఐకు ఊహించిన స‌మాధానం ఎదురైంది.

త‌మ అధికారుల‌కు ఎదురైన ప‌రిస్థితుల గురించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల‌న్న సీబీఐ వాద‌న‌ను సుప్రీం తోసిపుచ్చింది. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా.. సీబీఐ పిటిష‌న్ పై విచార‌ణ‌ను మంగ‌ళ‌వారం చేప‌ట్ట‌నున్న‌ట్లు కోర్టు స్ప‌ష్టం చేసింది.