Begin typing your search above and press return to search.

మాల్యా రివర్సు గేర్.. బ్యాంకులే అతగాడికి బాకీ పడ్డాయట

By:  Tupaki Desk   |   27 July 2021 6:41 AM GMT
మాల్యా రివర్సు గేర్.. బ్యాంకులే అతగాడికి బాకీ పడ్డాయట
X
వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల వద్ద నుంచి అప్పుగా తీసుకొని.. వాటిని చెల్లించకుండా.. ఆ మాటకు వస్తే చెప్పా పెట్టకుండా.. తన దారిన తాను బ్రిటన్ కు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయిన లిక్కర్ కింగ్.. విలాసపురుషుడు విజయ్ మాల్యాను లండన్ కోర్టు తాజాగా దివాలాకోరుగా తేల్చటం తెలిసిందే. అంతేకాదు.. ఈ కేసు అప్పీలుకు సైతం వెళ్లకుండా పిటిషన్ ను కొట్టేసి షాకిచ్చిన వేళ.. మాల్యా ఎలా రియాక్టు అవుతారు? అన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది.
పలువురు అంచనా వేసినట్లుగానే మాల్యా తాజాగా ట్విటర్ లో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లోని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు బ్యాంకులకు మాల్యా పెద్ద ఎత్తున డబ్బుల్ని ఎగ్గొట్టినట్లుగా ఉన్న వాదనకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తాను బ్యాంకులకు బాకీ లేనని..ఆ మాటకు వస్తే బ్యాంకులే తనకు బాకీగా ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు.

భారతీయ బ్యాంకులు.. ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ తనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే తనను దివాలాకోరుగా తేల్చేలా చేశాయని సంచలన వ్యాఖ్యలు చేవారు. తాను చేసిన అప్పులకు రెట్టింపు ఆస్తుల్ని బ్యాంకులు.. ఈడీలు తీసుకున్నాయని.. తాను చెల్లించాల్సిన మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని తనకు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాల్నివెల్లడించారు.

తాను ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.6.2 వేల కోట్ల మొత్తాన్ని తీసుకున్నానని.. ఇందుకు ఈడీ తన రూ.14వేల కోట్ల ఆస్తుల్ని జప్తు చేశాయన్నారు. తన నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో కొన్నింటికి అమ్మేసి బ్యాంకులు ఇప్పటికే రూ.9వేల కోట్ల నగదు రూపంలోరికవరీ చేసుకున్నాయన్నారు. మిగిలిన మొత్తాన్ని సెక్యురిటీ కింద ఉంచుకున్నాయన్నారు.

ఇప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్యాంకులు కోర్టుకు వెళ్లాయని.. తనను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయన్నారు. మరోవైపు.. మాల్యాపై దేశ కాని దేశంలో బ్యాంకులు న్యాయపోరాటం చేసి.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా లండన్ కోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా సరే.. వాటిని స్తంభింపచేసి తమ బకాయిల్ని రాబట్టుకునేలా కోర్టు తీర్పు ఉంది. ఇలాంటివేళలోనే మాల్యా సోషల్ మీడియాలో రియాక్టు అయ్యారు. మరి.. ఆయన చేసిన ఆరోపణలకు బ్యాంకులు.. ఈడీ ఏమని బదులిస్తాయో చూడాలి.