Begin typing your search above and press return to search.

యాత్ర‌లో కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్న భ‌ట్టి

By:  Tupaki Desk   |   29 April 2019 5:06 AM GMT
యాత్ర‌లో కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్న భ‌ట్టి
X
కాలం కొత్త అవ‌కాశాల్నిక‌ల్పిస్తుంటుంది. మామూలోళ్లు కాస్తా మ‌హా నేత‌లుగా మారే అవ‌కాశం ఉంటుంది. ఇందుకు కావాల్సింద‌ల్లా.. స‌మ‌యానికి స్పందించ‌టం.. అవ‌కాశాన్ని చేజిక్కించుకోవ‌ట‌మే. ప్ర‌త్యేక తెలంగాణ‌రాష్ట్ర నినాదాన్ని వినిపించ‌కుంటే.. కేసీఆర్ ప‌రిస్థితి ఏమిటి? మ‌ందిలో ఒక్క‌డిగా ఉండిపోయేవాడు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో నోరు తెరిచి.. తెలంగాణ అధికార‌ప‌క్షంపై ప‌ట్టుమ‌ని నాలుగు మాట‌లు కూడా అన‌ని ప‌రిస్థితి తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో నెల‌కొంది.

కేసీఆర్ స‌ర్కారులో త‌ప్పుల మీద త‌ప్పులు దొర్లుతున్నా.. ఎఫెక్టివ్ గా వాటిని ప్ర‌స్తావించే విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు ఫెయిల్ అవుతున్నారు. గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను గులాబీ కారు ఎక్కిస్తున్న కేసీఆర్ తీరును త‌ప్ప ప‌డుతూ.. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క తాజాగా ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌ను చేప‌ట్ట‌టం తెలిసిందే. తాజాగా త‌న యాత్ర‌ను షురూ చేసిన ఆయ‌న‌.. నిప్పులు చెరిగే వ్యాఖ్య‌ల‌తో సీఎం మీద మండిప‌డుతున్నారు.

భ‌ద్రాచ‌లంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఆయ‌న‌.. పిన‌పాక నుంచి త‌న యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ అధికార‌ప‌క్షానికి మంట పుట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను సంత‌లో బ‌ర్రెలు.. గొర్రెల్లా కొనేస్తూ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్న కేసీఆర్.. పాల‌న‌కు అర్హుడు కాద‌న్నారు.

చ‌ట్టం ప్ర‌కారం పార్టీ ఫిరాయించిన వారి అసెంబ్లీ స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేయాల‌ని స్పీక‌ర్.. గ‌వ‌ర్న‌ర్ల‌ను కోరినా చ‌ర్య‌లు లేవ‌న్నారు. ఈ ప‌రిస్థితుల్లో తాము ఇంకెవ‌రి వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ప్ర‌శ్నించారు. గెలిపించిన ప్ర‌జ‌ల్ని మోసం చేసి.. పార్టీ ఫిరాయించిన పిన‌పాక ఎమ్మెల్యే రేగ కాంతారావుపై పోరాడాల‌న్నారు.

బ‌ల‌మున్నోడిదే రాజ్య‌మైతే.. సామాన్యుల ప‌రిస్థితి.. పులులు.. సింహాల ముందు చిన్న ప్రాణుల మాదిరి త‌యార‌వుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి స‌చివాల‌యం త‌లుపులు తెరిచి.. రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల్సిన క‌నీస ద‌ర్మం ఉంద‌న్నారు. తెలంగాణ‌లో కేసీఆర్ క‌మాండ్ ఇస్తేనే.. ప‌ని చేసే ప‌రిస్థితికి అధికారులు.. ఉద్యోగులు చేరుకున్నార‌న్నారు. తెలంగాణ పున‌ర్నిర్మాణం పేరుతో 1940కి ముందు తెలంగాణ స‌మాజంలో ఉన్న భాంచ‌న్ దొర అనే ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ‌ను పున‌ర్నిర్మిస్తున్న‌ట్లు త‌ప్పు ప‌ట్టారు. కేసీఆర్ ను వేలెత్తి చూపించే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌ని భ‌ట్టి మాట‌లు.. కేసీఆర్ అండ్ కోకు ఇబ్బంది క‌లిగించేలా ఉన్నాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.