Begin typing your search above and press return to search.

అంతా ఊహించినట్టే.. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే!

By:  Tupaki Desk   |   19 Oct 2022 9:10 AM GMT
అంతా ఊహించినట్టే.. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే!
X
అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజ్యసభలో ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే ఘన విజయం సాధించారు.

అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించారు. అక్టోబర్‌ 19న బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 9500లకు పైగా ఓట్లు పోలవ్వగా.. ఖర్గేకు 7వేలపైగా ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి శశిథరూర్‌కు కేవలం 1072 ఓట్లు పోలయ్యాయి.

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టడానికి విముఖత చూపిన సంగతి తెలిసిందే. మొదట కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గాంధీల విశ్వాసపాత్రుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పేరు బాగా వినబడింది. అయితే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి గెహ్లాట్‌ ఒప్పుకోలేదు. దీంతో ఆయన తప్పుకున్నారు.

దీంతో కాంగ్రెస్‌ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కేంద్ర మాజీ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్‌లు పోటీ చేశారు. కాగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మద్దతుతోపాటు దేశంలో మెజారిటీ పీసీసీల మద్దతు ఖర్గేకే ఉందని వార్తలు వచ్చాయి. అంతా ఊహించినట్టే ఖర్గే అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. మల్లిఖార్జున ఖర్గే గెలుపుతో దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబేతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.