Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి మేడారం సీక్రెట్..వనదేవతల వద్దకు రాజకీయ నేతల క్యూ..

By:  Tupaki Desk   |   7 Feb 2020 7:40 PM IST
మల్లారెడ్డి మేడారం సీక్రెట్..వనదేవతల వద్దకు రాజకీయ నేతల క్యూ..
X
ప్రతీసారి మేడారం జాతర వచ్చిందంటే చాలు జనం పోటెత్తుతారు. వనదేవతలైన సమ్మక్క- సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు ఎగబడతారు. దేశంలో ఉన్న జనాభా అంతా గిరిజన గ్రామం మేడారం వైపే చూస్తుంది. భక్తుల తాకిడితో సమ్మక్క జాతర కళకళలాడుతుంది.

ఇకపోతే భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా మేడారానికి క్యూ కట్టడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు - ఎమ్మెల్యేలు అంతా మేడారం వెళ్లి వనదేవతల ఆశీర్వాదం తీసుకుంటారు. తమ కోరిక నెరవేర్చాలని ఆ సమ్మక్క తల్లికి మొక్కులు అప్పజెబుతారు. మేడారంలో మొక్కులు చెల్లిస్తే గ్యారంటీగా పదవీయోగం పడుతుందని తెలంగాణ నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇలా రాజకీయ నేతలు వరుసపెట్టి మేడారం వెళ్లడం వెనుక ఓ సీక్రెట్ దాగి ఉందని - దానికి కారణం మల్లారెడ్డి సక్సెస్ సీక్రెట్ అని తెలుస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.

2014 తెలంగాణ ఎన్నికల సమయంలో మేడారం తీర్థం జరుగుతోంది. ఆ సమయంలో మేడారం వెళ్లిన మల్లారెడ్డి తనకు ఎంపీ యోగం పట్టాలని కోరుకున్నారు. సమ్మక్క కరుణతో సరిగ్గా అదే జరిగింది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా టీఆర్ ఎస్ లో చేరిన మల్లారెడ్డి మరోసారి మేడారం వెళ్లి మంత్రి కావాలని కోరుకున్నారు. అది కూడా జరిగింది. ఇక తాను అనుకున్నది అనుకున్నట్లు కావడానికి కారణం మేడారం మొక్కులే అని మల్లారెడ్డి స్వయంగా సభాముఖంగా చెప్పారు.

సో మల్లారెడ్డి సక్సెస్ సీక్రెట్ తెలుసుకున్న తెలంగాణ లీడర్స్.. తాము కూడా వనదేవతలకు మొక్కులు చెల్లించి పదవీయోగం పట్టేయాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు మేడారానికి క్యూ కడుతున్నారట తెలంగాణ రాజకీయ నేతలు. మొత్తానికి మల్లారెడ్డి మంత్రం తెలంగాణ నేతలకు భలే రుచించింది కదూ!.