Begin typing your search above and press return to search.

మంత్రిగా ఉండి ఇలా మాట్లడవచ్చా ?

By:  Tupaki Desk   |   15 Sep 2021 8:32 AM GMT
మంత్రిగా ఉండి ఇలా మాట్లడవచ్చా ?
X
మంత్రి స్ధానంలో కూర్చుని కూడా మరీ ఇంత బాధ్యతలేకుండా మాట్లాడటం ఏమీ బాగోలేదు. హైదరాబాద్ లోని సైదాబాద్ ఏరియాలో 6 ఏళ్ళ చిన్నారిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. రాజు అనే యువకుడే చిన్నారిపై అత్యచారం చేశాడు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు. ఇదే ఘటనపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు చిన్నారిని హత్యచేసిన యువకుడిని ఎన్ కౌంటర్ చేస్తామంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యత లేని మాటలు ఎలా మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు.

చిన్నారిపై హత్యాచారం చేయటం తప్పన్నదాంట్లో రెండో మాటకు తావులేదు. రాజు చేసిన పనిని సభ్య సమాజంలో ఎవరు హర్షించరు. కానీ సదరు యువకుడిని శిక్షించటానికి మార్గాలున్నాయి. హైదరాబాద్ ఏమీ ఆఫ్ఘనిస్ధాన్లో లేదన్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు. మల్లారెడ్డి చెప్పిన మాటలు ఆప్ఘనిస్ధాన్ లాంటి దేశాల్లో అయితే చెల్లుబాటవుతుంది. ఎవరినైనా శిక్షించాలంటే మనదగ్గర చట్టము, న్యాయము అనే ప్రొసీజర్ ఉందన్న మాటను మంత్రి మరచిపోయినట్లున్నారు.

ఘటన విషయం తెలియగానే చాలామంది రాజును పట్టుకుని ఎన్ కౌంటర్ చేసేయాలని, ఉరితీసేయాలని ఆగ్రహంతో ఊగిపోయారు. సినీనటుడు మంచు మనోజ్ కూడా బాధిత కుటుంబాన్ని కలిసి రాజును పట్టుకుని వెంటనే ఉరితీసేయాలంటు డిమాండ్ చేశారు. మామూలు జనాలు ఎన్ని డిమాండ్లయినా చేస్తారు. ఎందుకంటే వారు ఎలాంటి డిమాండ్ చేసినా పెద్దగా పట్టించుకోవక్కర్లేదు.

కానీ మంత్రిగా, ప్రభుత్వంలో భాగస్తుడైన వ్యక్తే బాధ్యత లేకుండా రాజును ఎన్ కౌంటర్ చేసేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. బాధిత కుటుంబాన్ని ఊరడించాలంటే అందుకు చెప్పాల్సిన మాటలు ఇదికాదు. ప్రభుత్వం తరపున ఇంకేమైనా హామీలివ్వవచ్చు. అంతేకానీ కుటుంబం కోసం లేకపోతే జనాల కోసం ఎన్ కౌంటర్ చేస్తామనే మాటలు మాత్రం తప్పనే చెప్పాలి.

గతంలో వివిధ సందర్భాల్లో కొందరిని పోలీసులు ఎన్ కౌంటర్లుద చేసిన ఘటనలున్నది వాస్తవమే. కానీ ఎవరు ఇలా ముందుగా ప్రకటనలు మాత్రం చేయలేదు. ఎన్ కౌంటర్ల తర్వాత పోలీసులు దాన్ని సమర్ధించుకోవటానికి వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. కొన్ని ఘటనలపైన అయితే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటునే ఉన్నారు. ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ అయినా, చేయటమైనా తేలికే. కానీ తర్వాత దాన్ని సమర్ధించుకోవటమే చాలా కష్టం. ఏదేమైనా తాజాగా మల్లారెడ్డి ప్రకటన మాత్రం బాధ్యతా రాహిత్యమనే చెప్పాలి.