Begin typing your search above and press return to search.

బండబూతులు తిట్టేసిన మంత్రి మల్లారెడ్డి

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:08 AM GMT
బండబూతులు తిట్టేసిన మంత్రి మల్లారెడ్డి
X
విధేయతను ప్రదర్శించుకోవటానికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆ పనిలో నూటికినూరు మార్కులు కొట్టేసేలా వ్యవహరించారు టీ మంత్రి మల్లారెడ్డి. గడిచిన కొద్దికాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. మంత్రి కేటీఆర్ ను అదే పనిగా తిట్ల వర్షం కురిపిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తాజాగా మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్ సభలో కేసీఆర్ అండ్ కోపై మాటల దండయాత్ర చేసిన రేవంత్ తీరుపై ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

మల్లారెడ్డి తిట్లను వింటే.. చెవుల నుంచి రక్తం కారేలా నోటికి పని చెప్పిన ఆయన.. వెనుకా ముందు లేకుండా నోటికి వచ్చేసినట్లుగా తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఆవేశంతో ఊగిపోయారు. చివరకు ఎలాంటి చావు చస్తాడో చెబుతూ శాపనార్థాలు పెట్టేయటం గమనార్హం. ‘రేవంత్ రెడ్డి దోకేబాజ్ గాడు.. చర్లపల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడతాడా? రూ.50 కోట్లతో టీపీసీసీ పదవి తెచ్చుకున్న ఈ దొంగ.. సీఎంను పట్టుకొని ఎట్ల పడితే అట్ల తిడుతున్నడు. వాడు మామూలుగా చచ్చిపోడు. పురుగులు పడి చచ్చిపోతడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు.. కరెంటు ఇచ్చారా? వాళ్ల మొఖాలకు ఏం చేసిండ్రు.. మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చి.. పెద మనిషిని తిడతాడా? ఖబడ్డార్.. ఇడిసేదే లేదు బిడ్డా. ఏడపడితే ఆడ కొట్టి ఇడిసిపెడతాం. మా కార్యకర్తలు ఎవ్వరూ ఊరుకోరు’ అంటూ మండిపడ్డారు.

ఈ తిట్లకు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవం వేదికైంది. ప్రజలకు ఇతర పార్టీల మీద నమ్మకం పోయిందని.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సీఎం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని.. తన విధేయతను గట్టిగా వినిపించారు. అదే సమయంలో రేవంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన మల్లారెడ్డి తిట్ల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.