Begin typing your search above and press return to search.

కెఫే కాఫీ డే సీఈఓ గా మాళవిక హెగ్డే ...ఈమె ఎవరో తెలుసా ?

By:  Tupaki Desk   |   8 Dec 2020 10:58 AM IST
కెఫే కాఫీ డే సీఈఓ గా మాళవిక హెగ్డే ...ఈమె ఎవరో తెలుసా ?
X
కెఫే కాఫీ డే .. భారతదేశం తో పాటుగా ప్రపంచంలోని పలు దేశాల్లో గుర్తింపు పొందిన కాఫీ సంస్థ. బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశంలో కొన్ని వందల కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి భారతదేశంలో వృద్ధి చెందుతున్న మనీడ్‌ క్లాస్‌ జనాల కోసం కాపుచీనో, లాట్స్‌ ని అందుబాటులోకి తెచ్చాయి. కాఫీ డే.. స్టార్‌ బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీ వంటి వాటితో పోటీ పడి ముందుకు సాగుతుంది.

అయితే , గత ఏడాది కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌.వి. రంగనాథ్‌ ని తాత్కలిక చైర్మన్‌ గా నియమించారు. అయితే తాజాగా వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

మాళవిక కర్నాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. కాగా కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిలను నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారు. వీజీ సిద్ధార్థ మరణం గురించి వార్తలు వెలువడడంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు క్రాష్ అయ్యాయి. చివరికి ఫిబ్రవరి 3 నుంచి వాటి ట్రేడింగ్‌ నిలిపివేయబడింది.