Begin typing your search above and press return to search.

మా అధికారి మాక్కావాలి.. రోహిణి సింధూరికి మ‌ద్ద‌తుగా ఆన్ లైన్ ఉద్య‌మం!

By:  Tupaki Desk   |   13 Jun 2021 1:30 PM GMT
మా అధికారి మాక్కావాలి.. రోహిణి సింధూరికి మ‌ద్ద‌తుగా ఆన్ లైన్ ఉద్య‌మం!
X
‘రోహిణి సింధూరికి పాత పోస్టింగ్ అప్ప‌గించాలి.. మా అధికారి మాక్కావాలి..’’అంటూ కర్నాటకలో ఆన్ లైన్ ఉద్య‌మం మొద‌లైంది. సంచ‌ల‌న తెలుగు ఐఏఎస్ రోహిణి సింధూరి.. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా విధులు నిర్వ‌ర్తిస్తార‌నే పేరుంది. ప‌నిచేసిన ప్ర‌తిచోటా త‌న‌దైన మార్కు చూపిస్తున్న రోహిణిని త‌ర‌చూ ట్రాన్స్ ఫ‌ర్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి బ‌దిలీ అయ్యారు. దీంతో.. త‌మ అధికారిణి త‌మ‌కు కావాలంటూ మైసూర్ ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన రోహిణి సింధూరి.. 2009లో సివిల్స్ సాధించారు. నేష‌న‌ల్ లెవ‌ల్లో 43వ అత్యుత్త‌మ ర్యాంకు సాధించిన ఈమె.. క‌ర్నాట‌క కేడ‌ర్ కు ఎంపిక‌య్యారు. 2011లో త‌మ‌కూరు జిల్లా అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ గా తొలిపోస్టింగ్ తీసుకున్నారు. ఈ ప‌దేళ్ల కాలంలో ప‌లుమార్లు ఉద్యోగోన్న‌తి సాధించారు. అదే స‌మ‌యంలో ట్రాన్స్ ఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరున్న సింధూరి.. ప‌నిచేసిన ప్ర‌తిచోటా త‌న మార్కు చూపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. దీంతో.. ప‌లు వివాదాలు త‌లెత్తాయి.

వారం రోజుల క్రితం మైసూరు మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ శిల్పా నాగ్.. క‌లెక్ట‌ర్ రోహిణి సింధూరిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను టార్గెట్ చేశార‌ని, వేధిస్తున్నార‌ని మీడియా ముఖంగా చెప్పిన శిల్పా.. త‌న ఉద్యోగానికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో.. ఈ విష‌యం సంచ‌ల‌నం రేకెత్తించింది. శిల్పానాగ్ ఆరోపణ‌లు చేసిన మూడో రోజున మైసూర్ క‌లెక్ట‌ర్ పోస్టు నుంచి రోహ‌ణి సింధూరిణి త‌ప్పిస్తూ.. ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.

దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ గా ఆమెను బ‌దిలీ చేస్తూ స‌ర్కారు ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిపై రోహిణి.. ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌ను క‌లిసినా ఉప‌యోగం లేక‌పోయింది. దీంతో.. మైసూరు ప్ర‌జ‌లు స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఎలాంటి అవినీతికీ అవ‌కాశం ఇవ్వ‌కుండా.. అక్ర‌మార్కుల‌కు సింహ‌స్వ‌ప్నంగా మారిన సింధూరిణి ఉద్దేశ‌పూర్వ‌కంగానే బ‌దిలీ చేశార‌ని మండిప‌డుతున్నారు.

ఆమెను మ‌ళ్లీ మైసూరు క‌లెక్ట‌ర్ గా నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తూ.. ఆన్ లైన్ ఉద్య‌మం చేస్తున్నారు. #Bring back Rohini Sindhuri పేరుతో సంత‌కాల సేక‌ర‌ణ చేస్తున్నారు. ల‌క్షా 50 వేల సంత‌కాల‌ను సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకొని ఉద్య‌మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 90 వేల సంత‌కాల‌ను సేక‌రించిన‌ట్టు స‌మాచారం.

https://www.change.org/ అనే వెబ్ సైట్ ద్వారా సంత‌కాల‌ను సేక‌రిస్తున్నారు. క‌న్స‌ర్న్డ్ సిటిజ‌న్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. రోహిణి సింధూరిని మ‌ళ్లీ నియ‌మించే వ‌ర‌కు ఉద్య‌మిస్తామ‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. మ‌రి, దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.