Begin typing your search above and press return to search.

పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ లో రజినీ బిజీ బిజీ !

By:  Tupaki Desk   |   12 Dec 2020 12:09 PM IST
పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ లో రజినీ బిజీ బిజీ !
X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అతి త్వరలో ఎన్నో రోజుల అభిమానుల కోరికని మన్నించి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీ‌ 2017 డిసెంబర్‌ లో చెప్పారు. ఈ డిసెంబర్‌ 31న పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ ప్రకటించి, ఏప్రిల్‌ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపనపై మక్కల్‌ మన్రం నిర్వాహకులతో తలైవా‌ చెన్నైలోని తన ఇంటి వద్ద శుక్రవారం మరోసారి సమాలోచనలు జరిపారు.

ప్రధాన సమన్వయకర్త అర్జున్‌ మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్, మక్కల్‌ మన్రం రాష్ట్ర నిర్వాహకులు సుధాకర్, మన్రం మాజీ అధ్యక్షులు సత్యనారాయణన్‌ పాల్గొన్నారు. పార్టీ పేరును రిజిస్టర్‌ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద మక్కల్‌ మన్రం అగ్రనేతలు శుక్రవారం బిజీబిజీగా గడిపినట్టు తెలుస్తుంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తారు. ఆ తర్వాత 31 న అధికారికంగా పార్టీ ని ప్రకటించనున్నారు.

ఇకపోతే , ఈ రోజు రజినీ ‌ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేయనున్నారు. రజనీకాంత్‌ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని ప్రార్థిస్తూ మక్కల్‌ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు.