Begin typing your search above and press return to search.

మేక్ మై ట్రిప్.. గోఇబిబో.. ఓయోలకు రూ.392 కోట్ల ఫైన్

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:48 AM GMT
మేక్ మై ట్రిప్.. గోఇబిబో.. ఓయోలకు రూ.392 కోట్ల ఫైన్
X
ఆన్ లైన్ సేవలు అందించే ప్రముఖ సంస్థలుగా పేరున్న మైక్ మై ట్రిప్.. గోఇబిబో.. ఓయోలకు భారీ షాక్ తగిలింది. తాజాగా ఈ సంస్థలకు ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇంత భారీ మొత్తాన్ని మూడు సంస్థలకు విధించటం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇంతకు ఈ మూడు సంస్థలు చేసిన తప్పేంటి? అన్న విషయంలోకి వెళితే.. వివిధ హోటళ్లు.. రెస్టారెంట్లతో ఈ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు పోటీని దెబ్బ తీసేలా ఉన్నట్లు స్పష్టం కావటమేనని చెబుతున్నారు. తమ ప్లాట్ ఫామ్ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువ ధరకు సదరు సంస్థలు ఇతరులకు రూమ్ లను కేటాయించకూడదన్న రూల్ పెట్టిన వైనాన్ని తప్పు పట్టింది.

ఇలాంటి తీరు పోటీని దెబ్బ తీయటంతో పాటు.. వినియోదారుల హక్కుల్ని దెబ్బ తీసే అవకాశం ఉందని తేల్చింది. అంతేకాదు.. గుత్తాధిపత్యానికి తెర తీయటానికి కారణమవుతుందన్న కారణాన్ని చూపించిన సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వారికి భారీగా ఫైన్ వేయటంతో పాటు.. తాము ఒప్పందాలు చేసుకున్న హోటళ్లు.. రెస్టారెంట్లతో తాజా ఆదేశాలకు అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేసింది.

తాజాగా ఫైన్ షాక్ తగిలిన మేక్ మై ట్రిప్.. గోఇబిబో ఒకే సంస్థకు చెందినవి కాగా.. ఓయో మాత్రం వేరే సంస్థ అన్న విషయం తెలిసిందే. మొత్తం రూ.392 కోట్ల ఫైన్ లో రూ.223.48 కోట్లు మేక్ మై ట్రిప్.. గోఇబిబోలు చెల్లించాలని పేర్కొన్నారు. ఓయో మాత్రం రూ.168.88 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆన్ లైన్ సంస్థల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ వేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇంత కీలకమైన సమాచారం ప్రధాన మీడియా సంస్థల్లో ప్రముఖంగా రాకపోవటం.. ఆయా సంస్థలు చేసిన అడ్డగోలు విధానం గురించిన ప్రచారం పెద్దగా లేకపోవటం దేనికి నిదర్శనం?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.