Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఒక్కరోజు అవకాశమిస్తే బీజేపీ నేతల అంతు చూస్తాడట

By:  Tupaki Desk   |   17 Aug 2021 4:45 AM GMT
కేసీఆర్ ఒక్కరోజు అవకాశమిస్తే బీజేపీ నేతల అంతు చూస్తాడట
X
ఒక్క రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. రాష్ట్రంలో బీజేపీ నేతల అంతు చూస్తానంటూ ఊగిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి మాటలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. బండి సంజయ్ బట్టలూడాదీసి రోడ్డుపై నిలబెడతానన్నారు.ఇంతకూ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు చేసినట్లు అన్న విషయంలోకి వెళితే..

మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై తరచూ విమర్శలు చెలరేగుతుంటాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఆయన గుండాగిరి చేస్తారని.. హత్యారాజకీయాలకు పాల్పడుతుంటారని తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అయితే.. వారి విమర్శలు.. ఆరోపణలకు భిన్నంగా మైనంపల్లి స్పందిస్తుంటారు.తాజాగా మాత్రం రోటీన్ కు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంద్రాగస్టు వేళ జెండా వందనం సందర్భంగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ వర్సెస్ మైనంపల్లి వారి అనుచరుల మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.

తమ కార్పొరేటర్ పై దాడి జరిగిన విషయానికి తీవ్రంగా స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రావటం.. ఎమ్మెల్యే మైనంపల్లిపై ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మైనంపల్లి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తన ఆగ్రహ విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించారు. ఇటీవల కాలంలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని తీవ్రమైన పదజాలంతో ఇంత ఘాటుగా విమర్శించింది ఎవరూ లేరన్నట్లుగా మైనంపల్లి వ్యాఖ్యలు ఉన్నాయి.

సోమవారం జరిగిన బంద్.. మైనంపల్లి దిష్టిబొమ్మకు గాజులు తొడిగి తగలబెట్టిన వైనం తెలుసుకున్న ఆయన ఆవేశంతో ఊగిపోయారు. బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ‘తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అంతవరకు ఊరుకునేది లేదు. ముఖ్యమంత్ంరిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే బండి సంజయ్ బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతా. సీఎం కేసీఆర్ ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే బండి సంజయ్ అక్రమాలను తాను బయటపెడతానని.. ఎక్కువ మాట్లాడితే తోలు ఒలుస్తానని ఫైర్ అయ్యారు. భూకబ్జాదారులను వెంటబెట్టుకొని తిరుగుతున్నారని.. బండిసంజయ్ నిజ స్వరూపాన్ని త్వరలోనే ప్రజలకు చూపిస్తానని చెప్పారు. దమ్ముంటే.. బండి సంజయ్ తన తఢాఖాను పార్లమెంటులో చూపించాలని సవాలు విసిరారు. ‘‘బండి సంజయ్ నా ముందు బచ్చాగాడు. యూజ్ లెస్ ఫెలో. పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. నేను వాడిని కలవటం ఏమిటి? వాడు నా గోలితోకూడా సమానం కాదు. కేంద్రంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతలుకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. కేంద్రమే కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మద్దతు ఉన్నా అతని బట్టలు ఊడదీయటం ఖాయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త సెగలు పుట్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంత తీవ్ర వ్యాఖ్యలు ఏ నేత మీద మరోనేత చేసింది లేదు. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.