Begin typing your search above and press return to search.

మైనంపల్లి సీన్లోకి వస్తే రచ్చ రచ్చే! పోలీస్ స్టేషన్ ఎదుట షాకింగ్ సీన్లు!

By:  Tupaki Desk   |   17 Aug 2021 3:26 AM GMT
మైనంపల్లి సీన్లోకి వస్తే రచ్చ రచ్చే! పోలీస్ స్టేషన్ ఎదుట షాకింగ్ సీన్లు!
X
పంద్రాగస్టు వేళ హైదరాబాద్ మహానగర శివారు అసెంబ్లీ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అధికార టీఆర్ఎస్.. బీజేపీ మధ్య రాజుకున్నరగడ తీవ్రస్థాయికి వెళ్లటమేకాదు సోమవారం అనూహ్య పరిణామాలకు వేదికగా నిలిచింది. తీవ్రమైన ఉద్రిక్తలకు కారణమైంది. తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కోపంతో ఊగిపోతూ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు బీజేపీ నేతల వాహనాలపై దాడి చేయటం.. రాళ్లు.. కర్రలతో ధ్వంసం చేసిన వైనం స్థానికులకు షాకింగ్ గా మారింది. మైనంపల్లిసీన్లోకి వచ్చే రచ్చ రచ్చే అన్న మాటలకు నిలువెత్తు రూపంగా మారాయి.

పంద్రాగస్టు సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. ఆయన అనుచరులు దాడి చేసినట్లుగా ఆరోపణలు రావటం.. దీనికి స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రావటం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా బండి సంజయ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంల్ మల్కాజిగిరి బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. బంద్ నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి దిష్టిబొమ్మకు గాజులు తొడిగి దహనం చేయటంతో.. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దిష్టిబొమ్మ దహనం గురించి తెలిసినంతనే ఆవేశంతో ఊగిపోయిన మైనంపల్లి.. ఆయన కుమారుడు.. అనుచరులు పెద్ద ఎత్తున నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. బీజేపీ నేతల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు.. కర్రలతో వాహనాల్ని ధ్వంసం చేశారు. దీంతో.. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

మరోవైపు తీవ్ర ఆగ్రహంతో ఉన్న మైనంపల్లి.. నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ నేతల వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. వాగ్వాదం జరిగింది. హనుమంతరావు అనుచరులు తమ కార్లలో తెచ్చుకున్న రాల్లను పోలీసుల ఎదుటే.. బీజేపీ నేతల వాహనాలపై రువ్వారు.

షాకింగ్ అంశం ఏమంటే.. పోలీస్ స్టేషన్లోకి తమను వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల్ని తోసేయటంతో పాటు.. వారి వద్ద ఉన్న లాఠీల్ని లాక్కున్న వైనం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఈ ఉదంతంలో ఒక కానిస్టేబుల్ కు.. ఒక హోంగార్డుకు గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు అయినట్లు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. మైనంపల్లికి సర్ది చెప్పి ఆయన్ను పంపేశారు.ఈ గొడవ గురించి తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. మైనంపల్లిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. రౌడీయిజాన్నిబీజేపీ సహించదని.. చట్టప్రకారం తగిన బుద్ధి చెబుతామని మండిపడ్డారు.

నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ వద్ద దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే మైనంపల్లి.. ఆయన కుమారుడు రోహిత్ తో పాటు మరో 20 మందిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడులకు కారణమైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

మరోవైపు బీజేపీ నేతల మీదా కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ వద్ద రచ్చ చేసిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.