Begin typing your search above and press return to search.

పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసిన థియేట‌ర్ కు భారీ ఫైన్!

By:  Tupaki Desk   |   15 Sept 2018 10:53 AM IST
పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసిన థియేట‌ర్ కు భారీ ఫైన్!
X
పార్కింగ్ ఫీజును వ‌సూలు చేసిన ఒక థియేట‌ర్ యాజ‌మాన్యం అనుస‌రించిన వైఖ‌రిపై వినియోగ‌దారుల ఫోరం ఆస‌క్తిక‌ర తీర్పును ఇచ్చింది. పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసిన థియేట‌ర్ య‌జ‌మానికి భారీగా జ‌రిమానా విధించింది. హైద‌రాబాద్ మహాన‌గ‌రానికి చెందిన థియేట‌ర్ ఒక‌టి చేసిన ఈ ప‌నిపై కోర్టు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

హైద‌రాబాద్‌ కు చెందిన విజ‌య్ గోపాల్ గ‌త జూలైలో మ‌హేశ్వ‌రి ప‌ర‌మేశ్వ‌రి థియేట‌ర్ కు సినిమా చూసేందుకు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కారులో వెళ్లారు. అనంత‌రం అత‌డు త‌న కారును పార్క్ చేశారు. పార్కింగ్ స‌మ‌యంలో స్టాండ్ నిర్వాహ‌కుడు రూ.30 ఫీజు వ‌సూలు చేశాడు.

అదేమ‌ని అడిగితే.. స‌ద‌రు నిర్వాహ‌కుడు ప‌ట్టించుకోలేదు. దీంతో.. మ‌న‌స్తాపానికి గురైన విజ‌య్ గోపాల్ ఈ జ‌న‌వ‌రిలో క‌మ‌ర్షియ‌ల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని రూల్స్ కు వ్య‌తిరేకంగా పార్కింగ్ ఫీజు వ‌సూలు చేస్తూ దోపిడీకి పాల్ప‌డుతున్న వైనంపై హైద‌రాబాద్ వినియోగ‌దారుల ఫోరం -3లో కంప్లైంట్ చేశారు.

దీనిపై స్పందించిన ఫోరం థియేట‌ర్ యాజ‌మాన్యానికి నోటీసులు జారీ చేసింది. థియేట‌ర్ కాంప్లెక్స్ ప‌రిధిలో పార్కింగ్ ఫీజు లేకుంటే అంద‌రూ వ‌చ్చి త‌మ వాహ‌నాల్ని త‌మ పార్కింగ్ స్లాట్ లో నిలుపుతున్నార‌ని..దీంతో థియేట‌ర్ కు వ‌చ్చే వారికి ఇబ్బంది క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. అందుకే.. వాహ‌నాల్ని నిలుపుతున్న వారి నుంచి ఫీజు వ‌సూలు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

నిబంధ‌న ప్ర‌కారం.. సినిమా థియేట‌ర్లో కానీ.. షాపింగ్ కాంప్లెక్స్ లోని ఏ షాపు నుంచైనా ఏదైనా వ‌స్తువు కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు తిరిగి ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వ‌ని వైనాన్ని ప్రస్తావిస్తూ.. పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయ‌టం త‌ప్పుగా ఫోరం తేల్చింది. ఈ వ్య‌వ‌హారంలో విజ‌య్ గోపాల్‌ను థియేట‌ర్ యాజ‌మాన్యం మాన‌సిక క్షోభ‌కు గురి చేసినందుకు రూ.50వేలు జ‌రిమానా.. ఫోరంలో కేసు న‌మోదు చేసిన ఖ‌ర్చుల‌కు గాను రూ.5వేలు చెల్లించాల‌ని పేర్కొంటూ తీర్పును ఇచ్చింది.