Begin typing your search above and press return to search.

బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం?

By:  Tupaki Desk   |   12 Oct 2020 10:00 PM IST
బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం?
X
ఇటీవల విజయవాడలో సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య తీవ్ర సంచలనమైంది. ఈ కేసులో తాజాగా కొత్త కోణం బయటపడింది. మహేష్ హత్యలో అతడి స్నేహితుడు హరికృష్ణపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

తాజాగా మహేష్ సోదరి సునీత మీడియాతో మాట్లాడారు. తన సోదరుడిని పక్కా పథకంతో హత మార్చారని ఆమె ఆరోపించారు. పొలాల మధ్యలో మిత్రులతో కలిసి మహేష్ ఉన్నాడన్న విషయం తెలుసుకొని హరికృష్ణ అక్కడి వెళ్లాడని తెలిపింది.

ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో మళ్లీ మద్యం సేవిద్దామని మహేష్ ని హరికృష్ణ ఆపాడని మహేష్ సోదరి సునీత తెలిపారు. డబ్బులు పేటీఎం చేసి మద్యం కొనుక్కురమ్మని ఇద్దరు వ్యక్తులను బలవంతంగా పంపాడని తెలిపారు. మద్యం తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వచ్చి తన తమ్ముడు మహేష్ పై కాల్పులు జరిపారని సునీత ఆరోపించారు.

కాల్పులు జరిపిన వ్యక్తులు వెళ్లడానికి హరికృష్ణ కారును రివర్స్ చేసి మరీ ఇవ్వడంపై పలు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. హరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. ప్రేమ వ్యవహారం అని అందరూ అంటున్నారని.. అది తప్పుడు సమాచారం అన్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నాయన్నది కూడా నిజం కాదని సునీత స్పష్టం చేశారు.