Begin typing your search above and press return to search.

‘‘అయోధ్య’’ అగ్గి మరోసారి రేగనుందా?

By:  Tupaki Desk   |   17 Oct 2016 5:42 PM GMT
‘‘అయోధ్య’’ అగ్గి మరోసారి రేగనుందా?
X
కొన్ని కొన్ని అంశాల విషయంలో వీలైనంత దూరంగా ఉండటానికి మించిన పని మరొకటి ఉండదు. ఇలాంటి అంశాల్ని పులి మీద స్వారీగానే చెప్పాలి. ఒక్కసారి స్వారీ మొదలైతే.. దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పులికి ఆహారం అయ్యే పరిస్థితి. అలాంటి ఉదంతాల్లో అయోధ్యలోని రామజన్మభూమి వ్యవహారం ఒకటి. అసలే హిందుత్వ ముద్ర.. దానికి తోడు మోడీ. ఈ రెండు చాలు.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎన్ని పరిమితులు ఉండాలో అన్ని ఉండేందుకు. అయినప్పటికీ.. ఒక భారీ జూదానికి మోడీ తెర తీశారా? అంటే అవుననే చెబుతున్నారు.

అప్పుడెప్పుడో రగిలిన అయోధ్య రామాలయం ఇష్యూ నుంచి బయటకు రావటానికి బీజేపీకి ఇంతకాలం పట్టింది. ఒకప్పుడు తన ఎన్నికల ప్రణాళికలో మొదటి మూడు అంశాల్లో ఒకటిగా ఉండాల్సిన రామజన్మభూమి ఇష్యూను.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఎన్నికల ప్రణాళికలో ఎక్కడో ఆఖరున ప్రస్తావించి.. ప్రస్తావించకుండా ఉండిపోయారు. అలాంటి రామజన్మభూమి అంశాన్ని నేరుగా టచ్ చేయకున్నా.. రామాలయం ఇష్యూ తమను వీడలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. గెలుపు గుర్రంగా మారేందుకు వీలుగా.. హిందుత్వ మార్క్ ను బయటకు తీసేందుకు సిద్ధమైంది.

రామజన్మభూమి వివాదాస్పద భూమికి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 25 ఎకరాల స్థలంలో రామాయణ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు కేంద్రపర్యాటక మంత్రి మహేశ్ శర్మ మంగళవారం వెళ్లనున్నారు. తన తాజా టూర్ లో భాగంగా ఆయన రామాయణ సర్క్యుట్ అడ్వయిజరీ బోర్డుతో భేటీ కావటమే కాదు.. రామాయణ మ్యూజియంతో పాటు.. నేపాల్.. శ్రీలంకలోని రామాయణ ప్రదేశాల్ని రామజన్మభూమితో అనుసంధానం చేయాలన్న అంశంపై చర్చ జరపాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరజలు రాముడి జీవితం గురించి.. రామాయణ గురించి తెలుసుకునేలా ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది మోడీ సర్కారు ఆలోచన. అయితే.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మిగిలిన రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. దళిత ఓటుకార్డును ఇష్టారాజ్యంగా వాడేసుకునే మాయవతి లాంటోళ్లకైతే.. మోడీ సర్కారు తాజా నిర్ణయం మంట పుట్టిస్తోంది. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ముడిపెడతారా? అంటూ ఆమె ఆవేశంతో ప్రశ్నిస్తున్నారు. కులం కార్డుతో దూసుకెళ్లే మాయావతికి.. ఆమె కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన మోడీ తాజా నిర్ణయం చిరాకు పుట్టిస్తుందనటంలో సందేహం లేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/