Begin typing your search above and press return to search.

జీన్స్ , స్కర్ట్స్ తో ఇండియా రావొద్దు!

By:  Tupaki Desk   |   29 Aug 2016 7:29 AM GMT
జీన్స్ , స్కర్ట్స్ తో ఇండియా రావొద్దు!
X
మహిళలపై రోజురోజుకూ పెరిపోతున్న దాడులకు కారణాలు ఏమిటి? అని అంటే.. మహిళల్లో పెరుగుతున్న పాశ్చాత్య వస్త్రదారణే కారణమని కొందరంటే. అది కాదు - మగాడి మైండ్ సెట్ మారాలని మరికొందరు అంటుంటారు. ఈ విషయాలపై ఇప్పటికే చాలా రకాల వివాదాలు జరిగాయి. అయితే తాజాగా తాజాగా భారతదేశం వచ్చే విదేశీ పర్యాటకుల వస్త్రదారణకు సంబందించి కేంద్రమంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ నెట్ వర్క్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విదేశీ మహిళల భద్రత అంశంపై స్పందించిన కేంద్రమంత్రి మహేశ్ శర్మ.. భారతదేశ పర్యటనకు వచ్చిన పర్యాటకులు దయచేసి స్కర్టులు - జీన్సూ ధరించవద్దని సూచించారు. ఇకపై.. దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు ఎలా నడుచుకోవాలి.. ఎలా నడుచుకోకూడదు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఒక కార్డుపై రాసి భారత విమానాశ్రయాల్లో అడుగుపెట్టేవారికి అందజేస్తున్నామని కూడా ఆయన చెబుతున్నారు. సాంప్రదాయిక దేశమైన భారత్ లో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలులో ఉందని - తాజ్ మహల్ వంటి ప్రాంతాలను సందర్శించేప్పుడు విదేశీ మహిళలు స్కర్టులు - జీన్సూ ధరించివద్దని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగడంతో.. వివరణ ఇచ్చుకున్నారు మహేశ్ శర్మ.

విదేశీ మహిళలు తమ అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలు ధరించడాన్ని తాను తప్పు పట్టట్లేదని - ఒకరి డ్రెస్సింగ్ ను మార్చుకోమని చెప్పే అర్హత తనకు లేదని అన్నారు. కాకపొతే రాత్రి సమయాల్లో బయట తిరిగేటప్పుడు - పవిత్ర స్థాలాలకు వెళ్లేటప్పుడు మాత్రం స్కర్టులు వంటివి ధరించకపోతే మంచిదని చెప్పడమే తన ఉద్దేశ్యమని చెప్పారు. అయితే ఈ విషయాలపై నెటిజన్లు భిన్నవాదనలు వ్యక్తం చేశారు. దేవాలయాలు - పవిత్ర స్థాలాలు వంటి వాటి విషయంలో దుస్తులపై క్లారిటీగా చెప్పడం సమంజసమే కానీ.. విదేశాలనుంచి వచ్చిన వారంతా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్పే విధానం బాగాలేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే... తమ దేవాలయంలోకి మహిళలు జీన్స్ - స్కర్ట్స్ వంటి దుస్తులు వేసుకొని ప్రవేశించకుండా ఉజ్జయినిలోని జైన దేవాలయ ట్రస్ట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల వయసు పైబడిన వారంతా ఈ నిబంధనకు లోబడి ఆలయంలోకి రావాల్సి ఉంటుందని ప్రకటన వచ్చింది. ఈ విషయంపై మాట్లాడిన ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర సిరోలియా.. కేవలం భారతీయ సంప్రదాయంతో నిండిన వస్త్రాలనే ధరించాలని, జైన ఆలయంలోకి పాశ్చాత్య దుస్తులకు అవకాశం లేదని తెలిపారు.