Begin typing your search above and press return to search.

ఐయామ్ గ్రేట‌ర్ దెన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

By:  Tupaki Desk   |   9 Dec 2017 6:00 PM GMT
ఐయామ్ గ్రేట‌ర్ దెన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
X
ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగి ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు పోయాయి.. భూమి కోసం యుద్ధాలు జరిగాయి... నీళ్లకోసం కొట్లాడుకుంటున్నారు.. ఆధిపత్యం కోసం అణుబాంబులనే తయారు చేసుకుంటున్నారు... ఆయుధ వ్యాపారం కోసం - ఆయిల్ కోసం - ఆత్మ రక్షణ కోసం యుద్ధాలు జరిగాయి. కానీ, ప్రస్తుతం తెలుగు నేలపై విచిత్రంగా ఎవరు గొప్ప అనే విషయంలో పెద్ద యుద్ధం జరుగుతోంది.. ఇది వాగ్యుద్ధం... మాటలు - అరుపులు - కేకలు - బూతులు - బెదిరింపులు... ఒకటేమిటి ఈ యుద్ధంలో ఎన్నో ఆయుధాలు. ఇప్పటికే ఈ యుద్ధమేంటో అర్థమైపోయి ఉంటుంది. ఇది కత్తి మహేశ్ అనే సినీ విమర్శకుడు.. పవన్ కళ్యాణ్ అనే సినీ హీరో అభిమానుల మధ్య మొదలైన యుద్ధం. ఇప్పుడు ముదిరి పాకానపడి.. కులాల వరకు వచ్చింది. ఎవరు గొప్ప అనే ఒక పనికిమాలిన యుద్ధం కూడా జరుగుతోంది.

మా పవన్ ముందు నువ్వెంత.. ఆయన ఇమేజ్ ముందు నువ్వెంత.. ఆయన స్టార్‌డమ్ ముందు నువ్వెంత.. ఆయన స్టైల్ ముందు నువ్వెంత’’ అంటున్నారు పవన్ అభిమానులు. అయితే.. కత్తి ఏమీ ఊరుకోవడం లేదు..‘‘నేను పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ చదువుకున్నాను.. సొంతంగా పైకొచ్చాను.. ఎవరి సాయం లేకుండా ఇంతోణ్నయ్యాను.. కాబట్టి నేనే గొప్ప’’ అంటున్నాడు కత్తి మహేశ్. ‘‘ ‘‘మీ పవన్‌కు ఏం తెలుసు.. ? రాష్ట్రంలో సమస్యలు తెలుసా.. దేశంలో సమస్యలు తెలుసా?.. తెలిస్తే నాతో చర్చకు రమ్మనండి.. నేను గొప్పో, పవన్ గొప్పో తెలిసిపోతుంది’’ అంటున్నాడు. దీనికి పవన్ వర్గం నుంచి సమాధానం ఉండడం లేదు.

ఇంతకీ పవన్ అభిమానులకు కత్తి మహేశ్ మీద కోపం ఎందుకొచ్చిందంటే అందుకు కారణం ఉంది. పవన్ గురించి ఒక ఇంటర్వ్యూ లో తన ఒపీనియన్ చెప్పాడు అది పవన్ అభిమానులకు రుచించలేదు. మహేష్ కత్తి మాటలు పవన్ కి ఎగైనెస్ట్ గా ఉన్నాయ్ ...తాజాగానూ మరోసారి పవన్ పై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. పవన్ అజ్ఞాతవాసి అనే ఒక సినిమా తీస్తున్న సమయం.. మరోవైపు రాజకీయంగా హడావుడి చేస్తున్న సమయంలో కత్తి మరోసారి తన నోటికి పని చెప్పారు. పవన్ అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అన్నారు. దీంతో పవన్ అభిమానులకు ఎక్కడ లేని కోపమొచ్చింది.

గతంలో పవన్ అభిమానులకు కత్తిపై కోపమొచ్చినప్పుడు కూడా కాస్తంత దూకుడుగానే స్పందించారు. కత్తికి ఫోన్ చేసి బెదిరించారన్న ఆరోపణలూ ఉన్నాయి. వివిధ ఛానళ్లో ప్రోగ్రాంలు చేసే కమెడియన్లు, యాంకర్లలో కొందరు కూడా ఆయన పొట్ట - బట్టతలపై జోకులేసి అవమానించారు. కొందరు ఆయన పరోక్షంలోనూ తమతమ వేదికలపై కత్తితో కామెడీలు చేశారు.

అయితే... కత్తి ఆ ఎపిసోడ్లన్నీ అయిపోయాక మరింత తీవ్రంగా తలపడుతున్నారు నా స్థాయేంటి - పవన్ స్థాయేంటి అన్న చర్చకు దిగుతున్నారు. ఐయామ్ గ్రేటర్ దేన్ పవన్ అంటున్నారు.

కత్తి, పవన్ వర్గం వివాదం - ఆరోపణలు ప్రత్యారోపణలను చూస్తున్నవారంతా సోషల్ మీడియాలో ఇద్దరినీ వాయించేస్తున్నారు. ఇద్దరికి ఇద్దరూ ఒకటే అంటున్నవారు కొందరైతే.. ‘‘మీలో ఎవరు గొప్పయితే మాకేంటి.. ’’ అంటూ విసుక్కుంటున్నారు.