Begin typing your search above and press return to search.

గాంధీకి నిరాడంబరత నేర్పిందెవరో తెలుసా..?

By:  Tupaki Desk   |   2 Oct 2015 8:44 AM GMT
గాంధీకి నిరాడంబరత నేర్పిందెవరో తెలుసా..?
X
గాంధీ అంటే ఈ దేశానికి దేవుడు.. ఆయన గొప్పదనం భారత్ లోనే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు. అలాంటి గాంధీజీ జీవితంలో ఎన్నో విశిష్ఠతలు, ఆయన చూపించినవి ఎన్నో గొప్ప దారులు. చుక్క రక్తం చిందకుండా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని సఫలం చేసిన ఆ అహింసా ధీరుడు ఒంటి నిండా చొక్కా కూడా వేసుకోరు... సమావేశాల్లో కిందే కూర్చుంటారు.. దాని వెనుక ఉన్న కారణాన్నీ చరిత్రకారులు చెబుతుంటారు. అయితే... ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన కథనం ఒకటున్నా వాస్తవ ఘటన మాత్రం వేరని ఉత్తర, తూర్పు భారతదేశంలో పలువురు చెబుతుంటారు. అందుకు దశాబ్దాల కిందట ప్రచురితమైన ఆర్టికళ్లను ఆధారాలుగా చూపిస్తుంటారు. గాంధీని ఆదర్శంగా తీసుకున్న ఒరిస్సాకు చెందిన మహనీయుడినే గాంధీ ఆదర్శంగా తీసుకుని ఈ అలవాటు చేసుకున్నారని ఒడిశా - బీహార్ - బెంగాల్ ప్రాంతంలో చెబుతుంటారు. గాంధీజీ చొక్కా వేసుకోకుండా ఉత్తరీయం కప్పుకుంటూ సింపుల్ గా ఉండడానికి ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం... ఉత్కళ మణిగా పిలుచుకునే పండిట్ గోపబంధు దాస్ ఆదర్శమని అంటారు.

ఉత్కళ మణి గోపబంధు దాస్ విగ్రహాలు ఒడిశాలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆయన చరిత్ర తెలుసుకుంటే అదో మహాగ్రంథం. గాంధీజీ జాతి పిత అయితే... గోపబంధు ఒడిశాలో జాతీయోద్యమ పిత... ఈ బిరుదు ఇచ్చింది ఎవరో కాదు... స్వయంగా సుభాష్ చంద్రబోస్ ఆయన్ను ఇలా పిలిచేవారు. ఒరిస్సాలో వరదల నివారణపై, విద్యాసంస్కరణల దిశగా ఎంతో కృషిచేసిన ఈయన అనంతరం ఇంకొందరితోకలిసి ఉత్కళ సమ్మిళన్ ఏర్పాటుచేసి ప్రత్యేక ఒరిస్సా కోసం పోరాడారు. అనంతరం ఉత్కళ సమ్మిళన్ ను కాంగ్రెస్ లో కలిపేసిన తరువాత... ఒరిస్సా కాంగ్రెస్ కు మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. బీహార్ - ఒరిస్సా అసెంబ్లీల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన గోపబంధు అత్యంత నిరాడంబరుడు. తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయి అనాథయిన ఆయన పెద్ద చదువులు చదువుకున్నారు.. అనంతరం భార్యాబిడ్డలు - తమ్ముడిని కూడా కోల్పోయి ఒంటరిగా బతికారు. చొక్కా వేసుకునేవారు కాదు... ఒంటినిండగా షాలువా వంటిది కప్పుకొనేవారు.

1921 తొలినాళ్లలో గాంధీజీని ఒరిస్సాకు తీసుకొచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటుచేయగా అందరూ కింద కూర్చున్నారు... గోపబంధు - గాంధీజీలకు మాత్రం కుర్చీలు వేశారు. అప్పుడు గోపబంధు... గాంధీని కుర్చీపై కూర్చోమని కోరి తాను అందరితో పాటుగా కింద కూర్చున్నారు. దాంతో గాంధీ కూడా కిందే ఆసీనులయ్యారు. గోపబంధు తీసుకునే సాధారణ ఆహారం... అతి సామాన్య జీవన విధానం - అందరితో కలిసిపోయే తీరు - నిరుపేదలకు సరైన దుస్తులు లేవన్న కారణంతో తానూ కేవలం ఒక దుప్పటి వంటిది కప్పుకోవడం వంటివి గాంధీజీని ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి ఆయన కూడా అదే పద్ధతి ఆచరించడం ప్రారంభించారు. గాంధీజీ అప్పటి నుంచి చొక్కా వేసుకోలేదు.... సమావేశాలలో కిందే కూర్చునేవారు. అందుకే ఇప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సమావేశాల్లో అధిష్ఠానంలోని పెద్దలు సహా అంతా నేలపై పరుపులు వేసుకుని కూర్చోవడం కనిపిస్తుంది. ఆ విధంగా గాంధీజీ నిరాడంబరతకు ఉత్కళమణి గోపబంధు కారణమయ్యారు. అయితే... 1921లోనే తమిళనాడులోని మదురైలో సమావేశానికి వచ్చిన గాంధీ అక్కడి రైతులు చొక్కాలు వేసుకోకుండా ఉండడం చూసి చలించిపోయి ఆ నిర్ణయం తీసుకున్నారన్న కథనం కూడా వ్యాప్తిలో ఉంది. కానీ, అంతకు కొద్ది రోజుల ముందే ఆయన గోపబంధు ను చూసి ఇలా మారారన్నదే సత్యమని చెబుతుంటారు.