Begin typing your search above and press return to search.

53 మంది ఎంఎల్ఏలకు షోకాజ్ నోటీసులా ?

By:  Tupaki Desk   |   11 July 2022 7:51 AM GMT
53 మంది ఎంఎల్ఏలకు షోకాజ్ నోటీసులా ?
X
మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే కూల్చేసి తాను ముఖ్యమంత్రి వారం రోజులవుతున్నా ఇంకా దాని తాలూకు ప్రకంపనలు కనబడుతునే ఉన్నాయి. తాజాగా 53 మంది ఎంఎల్ఏలకు శాసనసభ కార్యదర్శి షో కాజ్ నోటీసులు జారీచేయటం సంచలనంగా మారింది. ఏక్ నాథ్ షిండే అసెంబ్లీ బలప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శివసేన ఎంఎల్ఏలు 55 మందికీ విప్ జారీచేశారు.

విప్ జారీచేయటం అంటే షిండే నాయకత్వంలోని 40 మంది ఎంఎల్ఏలు+థాక్రే నేతృత్వంలో 14 మంది ఎంఎల్ఏలకు కలిపి చీఫ్ విప్ విప్ జారీచేశారు. అయితే వీరిలో విప్ ధిక్కరించారన్న కారణంతో అనర్హత వేటు వేసేందుకు వీలుగా 53 మంది ఎంఎల్ఏలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 53 మందిలో షిండేవర్గం ఎంఎల్ఏలు 39 మంది ఉంటే థాక్రే మద్దతు ఎంఎల్ఏలు 14 మందున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే థాక్రే వర్గంలోని ఎంఎల్ఏలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటే అర్ధముంది. అయితే షిండేవర్గంలోని 39 మంది ఎంఎల్ఏలకు కూడా ఎందుకు నోటీసులు జారీచేశారో తెలీటం లేదు. పైగా ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే మాజీ సీఎం ఉథ్థవ్ థాక్రే కొడుకు, ఎంఎల్ఏ అయిన ఆదిత్య థాక్రేకి నోటీసు ఇవ్వకపోవటం. షోకాజ్ నోటీసుల నుండి ఆదిత్యను ఎందుకు మినహాయించారో ఎవరికీ అర్ధం కావటంలేదు.

అనర్హత వేటుకు ముందు షోకాజ్ నోటీసులు విప్ ధిక్కరించిన వారికి జారీ చేస్తారు. షిండే వర్గం మొత్తం అసెంబ్లీకి వచ్చి షిండేకి అనుకూలంగానే ఓట్లేసింది. వీళ్ళందరు ఓట్లేయకపోతే షిండేకి అనుకూలంగా 164 ఓట్లు పడే అవకాశమే లేదు. అలాంటిది ఓట్లేసిన వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ అయ్యాయో తెలీటం లేదు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతునే ఉన్నది.