Begin typing your search above and press return to search.

మ‌హా పొత్తు చిత్త‌వుతుందా కుంప‌ట్లు రాజుకున్నాయ్‌!

By:  Tupaki Desk   |   11 Oct 2019 9:53 AM GMT
మ‌హా పొత్తు చిత్త‌వుతుందా కుంప‌ట్లు రాజుకున్నాయ్‌!
X
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం వేడేక్కగా బీజేపీ - శివ‌సేన మ‌ధ్య పొత్తు ఆదిలోనే హంస‌పాదు అన్న‌ట్టుగా మారింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శివసేనకు బలం ఉన్న కొన్ని సీట్లను బిజెపికి కేటాయిస్తే.... బీజేపీకి బలం ఉన్న కొన్ని సీట్లను శివ‌సేన‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఆయా పార్టీల‌లో బలమైన నేతగా ఉన్న వారు ఇప్పుడు రెబల్స్ గా మారుతున్నారు. మరికొన్ని చోట్ల తమ నాయకులకు మద్దతుగా వీరంతా తమ స్థానిక సంస్థల పదవులకు రాజీనామాలు చేసి తమ పార్టీ అధిష్టానంకు సవాల్ విసురుతున్నారు.

సీట్ల పంపకాల అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్‌–డోంబివలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. శివసేన అధ్యక్షులు ఉద్దవ్‌ ఠాక్రేకు తమ రాజీనామా పత్రాలను పంపించారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ నెల 21న జ‌రుగుతుండ‌గా.. 24న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక థానే జిల్లాలో శివ‌సేన‌కు గ‌ట్టి ప‌ట్టు ఉంది. ఈ జిల్లాలో మొత్తం 18 సీట్లు ఉన్నాయి. శివ‌సేన‌కు ప‌ట్టున్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

ఇలాంటి నేపథ్యంలో శివసేనతోపాటు ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఈ సంఘటన తీవ్ర తలనొప్పిగా మారింది. ఇక కీల‌క‌మైన క‌ళ్యాణ్ నియోజ‌క‌వర్గ సీటును శివ‌సేన కోరుకుంది. పొత్తులో భాగంగా ఇది శివ‌సేన ఖాతాలోకి వెళ్లింది. ఇది శివ‌సేన కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌, ఎన్సీపీల నుంచి బీజేపీ, శివ‌సేన‌లో ఆఖ‌ర్లో చేరిన కొంద‌రు నేత‌ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డంపై కూడా ఈ రెండు మిత్ర‌ప‌క్ష పార్టీల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి.

ఇక మ‌ర‌ఠ్వాడా ప్రాంతంలో ప‌లు జిల్లాల్లో శివ‌సేన‌, బీజేపీ రెబ‌ల్స్ భారీ ఎత్తున పోటీలో ఉండ‌డంతో పాటు వీరిలో చాలా మంది వేల‌ల్లో ఓట్లు చీల్చే స‌త్తా ఉన్న‌వారు కావడంతో ఈ రెండు పార్టీల అధిష్టానాల‌కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇక నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ + ఎన్సీపీ కూట‌మిలో పూర్తి నైరాశ్యం నెల‌కొన‌గా... ఇప్పుడు బీజేపీ + శివ‌సేన రెబ‌ల్స్‌.. ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉప్పు నిప్పులా ఉన్న వాతావ‌ర‌ణంతో పాటు... ఒక‌రిని మ‌రొక‌రు న‌మ్మే ప‌రిస్థితి లేక‌పోవ‌డం లాంటి అంశాలే త‌మ గెలుపున‌కు స‌హ‌క‌రిస్తాయ‌న్న ధీమాతో ఉన్నారు.