Begin typing your search above and press return to search.

మలుపుతిరిగిన మహారాష్ట్ర రాజకీయం

By:  Tupaki Desk   |   9 Nov 2019 11:39 AM GMT
మలుపుతిరిగిన మహారాష్ట్ర రాజకీయం
X
మహారాష్ట్ర రాజకీయం మలుపు తిరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మేజిక్ మార్క్ మెజార్టీ రాకపోవడంతో పొత్తులతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కలిసి పొత్తు పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ-శివసేన ఫలితాల తర్వాత మాత్రం విడిపోయాయి. శివసేన సీఎం కుర్చీ సగం ఇస్తేనే పొత్తు అనడంతో బీజేపీ దాన్ని ఒప్పించలేక అధికారాన్నే వదులుకుంటోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీఎం అభ్యర్థి ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర రాజకీయం ఎటువైపు వెళుతుందని ఉత్కంఠగా మారింది.

మహారాష్ట్రలో నేటితో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఖచ్చితంగా పొత్తు అవసరం. బీజేపీ, శివసేన పొత్తు చెడడంతో ఇప్పుడు మహారాష్ట్రలో 50కు పైగా సీట్లు సాధించిన ఎన్సీపీ అధినేత శరద్ పవర్ చక్రం తిప్పడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన ఆయన ఇన్నాళ్లు శివసేనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు అయోధ్యపై తీర్పు వచ్చిన దరిమిలా ఆయన మనసు మార్చుకున్నట్టు సమాచారం.

శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తుండడం మహారాష్ట్రలో వేడిపుట్టిస్తోంది. కాంగ్రెస్ కూడా దీనికి సహకరిస్తుండడం బీజేపీకి షాకింగ్ లా మారింది.

తాజాగా ముంబైలోని శరద్ పవార్ నివాసంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేతలు తోరట్, అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, ఫృథ్వీరాజ్ చవాన్ లు వేర్వేరుగా పవార్ తో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన, కాంగ్రెస్ లను పవర్ ను ఒప్పించినట్టు తెలిసింది.

బీజేపీకి బాగా దగ్గరైన దానికి బీటీం లాంటి పార్టీ శివసేనతో కలువడానికి కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పే అవకాశాలుంటాయి. ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందనే భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. అయితే పవార్ మాత్రం బీజేపీని దెబ్బకొట్టడానికే ఇదే సరైన సమయం అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను ఒప్పించేందుకు రెడీ అయినట్లు సమాచారం. బీజేపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ కలిసిరావచ్చని భావిస్తున్నారు.

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిస్తే 154 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే మతతత్వ శివసేనతో కాంగ్రెస్ కలుస్తుందా లేదా అన్నదే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉంది.