Begin typing your search above and press return to search.

ఫడ్నవీస్ కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   29 Jan 2016 12:06 PM GMT
ఫడ్నవీస్ కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు ఏపీ ప్రభుత్వమే కాదు మహారాష్ట్ర ప్రభుత్వం ఇరుకునపడుతోంది. రాష్ట్ర విభజన తరువాత మిగులు రాష్ర్టంగా అవతరించిన నేపథ్యంలో తెలంగాణ మొదటి నుంచి ఆర్థికంగా దూకుడు మీద ఉంది. మరోవైపు ఏపీ తీవ్రమైన లోటుతో నానా ఇక్కట్లు పడుతోంది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు - కాంట్రాక్టు సిబ్బంది - ప్రజాప్రతినిధులకు భారీగా జీతాలు పెంచుకుంటూ పోతుండడంతో పొరుగునే ఉన్న ఏపీలో ఆ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు - సిబ్బంది - ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణతో పోల్చుకుంటూ తమకూ జీతాలు పెంచాలని కోరుకోవడం, డిమాండు చేయడం జరిగాయి. ఉద్యోగుల వేతన స్థిరీకరణ కూడా కేసీఆర్ వారు అడిగిన కంటే ఎక్కువగా 41 శాతం చేయడంతో ఏపీ కూడా అలాగే చేయాల్సి వచ్చింది. ఆర్టీసీ - అంగన్ వాడీ... ఇలా అందరి విషయంలోనూ కేసీఆర్ వేతన పెంపు ప్రభావం ఏపీపై పడుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ సెగ మహారాష్ట్రనూ తాకింది. అక్కడి పోలీసు సిబ్బంది తెలంగాణలోని పోలీసులతో పోల్చుతూ.. కేసీఆర్ నిర్ణయాలతో పోల్చుతూ మహా ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.

కేసీఆర్ తెలంగాణ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పోలీసుల సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అత్యాధునిక వాహనాలు - ఆయుధాలు సమకూర్చడమే కాకుండా వారి జీతభత్యాలనూ పెంచారు. ఇప్పుడు ముంబయి ట్రాఫిక్ పోలీసులు కూడా తమకు తెలంగాణలో ఉన్న సౌకర్యాలు కావాలంటూ ఆ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఈమధ్యే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల వేతనాలను పెంచింది. ఆ సంగతి తెలిసిన ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు కూడా తమ వేతనాలను పెంచాలని ప్రతిపాదించారు. తమ డ్యూటీలో భాగంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోందని...దీంతో వాహనాలు విడుదల చేసే కార్బన్‌ మోనాక్సైడ్‌ - నైట్రోజన్‌ ఆక్సైడ్ వంటి కాలుష్య వాయువులతో పాటు ధ్వని కాలుష్యం వల్ల కూడా తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి కాలుష్య అలవెన్సు ఇవ్వడమే కాకుండా 30 శాతం మేర జీతాలు పెంచాలని కోరుతున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫడ్నవీస్ కూ ఫిటింగ్ పెట్టారన్న మాట.