Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ .. సెల్ఫీ దిగాలంటున్న పోలీసులు ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   17 April 2020 12:30 AM GMT
లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ .. సెల్ఫీ దిగాలంటున్న పోలీసులు ..ఎందుకంటే !
X
కరోనా కట్టడికోసం ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. నిత్యావసర సరుకుల కోసం కానీ , అత్యవసరం అయితే తప్ప ఇళ్లల్లో నుండి బయటకి రావొద్దు అని ప్ర‌భుత్వాలు ఎంత చెప్పినా కొంత‌మంది వినడంలేదు. ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించేవారికి త‌గిన బుద్ధి చెప్పేందుకు పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. తాము త‌ప్పు చేశామ‌ని వారితో చెప్ప‌క‌నే చెప్పించారు. ఇది అంద‌రికీ తెలిసేలా వారి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ గుణ‌పాఠం నేర్పుతున్నారు.

ఇలా పోలీసులు వింత శిక్ష విధిస్తున్న‌‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని కొల్లాపూర్‌ లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కొల్లాపూర్‌ లో లాక్‌ డౌన్ ముగిసేవ‌ర‌కు అత్య‌వ‌స‌ర ప‌ని మిన‌హా మిగ‌తా దేనికీ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌న్న నిబంధ‌న‌ల‌ను కొంద‌రు బేఖాత‌రు చేస్తున్నారు. దీంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారితో పోలీసులు సెల్ఫీ తీయించారు.

సెల్ఫీలే కదా ఏమౌతుంది అని అనుకోకండి ..అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ..నేను బాధ్య‌తా రాహిత్యంగా మెలుగుతాను, నేనొక స్వార్థ‌ప‌రుడిని అని రాసి ఉన్న ప్ర‌త్యేక సెల్ఫీ పాయింట్ల వ‌ద్ద ఫొటోలు దిగ‌మ‌ని వాటిని పోలీసుల‌ ఫేస్‌బుక్ పేజీలో అప్‌ లోడ్ చేస్తారు. అస‌లే తాము అప్‌ లోడ్ చేసే ఫొటోకు ఎన్ని లైకులు వ‌చ్చాయి, ఎంత‌మంది చూశారు, అని పడి చచ్చిపోయే యువ‌త ఈ వింత‌ సెల్ఫీల‌తో అవమానంగా భావించి కొంచెం అయినా కూడా మారతారేమో అని వారి ఆశ‌. దీని గురించి కొల్లాపూర్ ఎస్పీ అభిన‌వ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ... నిబంధ‌న‌లున ఉల్లంఘిస్తున్న‌వారు బ‌య‌ట‌కు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వీడియో రికార్డింగ్ చేస్తున్నామ‌న్నారు. బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు క‌నీసం మాస్కు కూడా ధ‌రించ‌ట్లేద‌ని, భౌతిక దూరం కూడా పాటించ‌ట్లేద‌ని తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.