Begin typing your search above and press return to search.

ఫడ్నవీస్ తో శివసేన భేటీ... ‘మహా’ ప్రతిష్టంభన తొలగినట్టేనా?

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:15 PM GMT
ఫడ్నవీస్ తో శివసేన భేటీ... ‘మహా’ ప్రతిష్టంభన తొలగినట్టేనా?
X
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు, వారాలు గడుస్తున్నా... అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటు పై నెలకొన్న ప్రతిష్టంభనకు సంబంధించి బుధవారం అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. పవర్ షేరింగ్ పై చేరో వాదన వినిపిస్తూ...అ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీ, శివసేనల మధ్య తొలి కీలక భేటీ జరిగింది. శివసేనకు ఆరుగురు కీలక నేతలు, మొన్నటిదాకా ఫడ్నవీస్ కేబినెట్ లో మంత్రులుగా కొనసాగిన నేతలు ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతాంగం సంక్షోభం పై చర్చించడానికి శివసేన నేతలను స్వయంగా ఫడ్నవీసే ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నా... కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చల కోసమే ఈ భేటీ జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనన్నట్లుగా ఈ భేటీలో రైతాంగం సంక్షోభంతో పాటు ప్రభుత్వ ఏర్పాటు పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా బీజేపీకి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే సుధీర్ ముంగటివార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ నుంచి శివసేనను ఎవ్వరూ వేరుచేయలేరు. ఇద్దరమూ కలిసే ఉన్నాం. మేము మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నాం. ఆ శుభవార్త ఏ క్షణంలోనైనా రావొచ్చు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య నెలకొన్ని ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా శివసేన తమ దారికి రాకుంటే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ముంగటివార్... ఇప్పుడు ఏకంగా శివసేనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఇరు పార్టీల ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెప్పడం చూస్తుంటే... మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... నిన్నటిదాకా బీజేపీ తమ దారికి రాకుంటే... తాము ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న దిశగా సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన... మహారాష్ట్రంలో పెనున కలకలం రేపింది. అయితే మొన్నటిదాకా శివసేనకు మద్దతుగానే కొనసాగుతున్నట్లుగా కనిపించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తేల్చేయడంతో ఇప్పుడు గత్యంతరంలేని పరిస్థితుల్లోనే శివసేన ఫడ్నవీస్ వద్దకు వెళ్లినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మునుపటి కంటే మెరుగైన రీతిలో సీట్లు సాధించినందున అధికారాన్ని చెరి సగం పంచుకుందామని, సీఎం పోస్టును చెరి సగం కాలం పంచుకుందామని శివసేన చేసిన ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అన్న నేపథ్యంలోనే ఈ ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఈ ప్రతిష్టంభన తొలగినట్టేనన్న వాదన వినిపిస్తోంది.