Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర మ్యాజిక్ : 26న బీజేపీ సర్కార్ ప్రమాణం...?

By:  Tupaki Desk   |   23 Jun 2022 3:15 PM GMT
మహారాష్ట్ర మ్యాజిక్ :  26న బీజేపీ సర్కార్ ప్రమాణం...?
X
మహారాష్ట్ర రాజకీయం ఇపుడు జాతీయ రాజకీయాల్లో కలి పుట్టిస్తోంది. హాయిగా కాపురం చేసుకుంటున్న మూడు పార్టీలలో చిచ్చు రేపింది. శివసేన మీద కన్నేసి మొత్తానికి మొత్తం చీల్చేసిన ఎపిసోడ్ తో ఇపుడు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అంపశయ్య మీద ఉంది. రేపో మాపో ఉద్ధవ్ రాజీనామా చేయడమే ఇక మిగిలింది. అదే లాంచనం కూడా.

ఈ క్రమంలో మహారాష్ట్రలో చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది అని వార్తలు చక్కలు కొడుతున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చక్రాలు కూల్చిన పాత్ర తెర ముందు రెబెల్ మంత్రి ఏక్ నాధ్ షిండేది అయితే తెర వెనక సూత్రధారి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని అంటున్నారు. దానికి తార్కాణంగా ముంబై వీధుల్లో షిండే ఫడ్నవీస్ ఇద్దరి బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలు హఠాత్తుగా వెలియడం చూడాలి.

ఇక ఇప్పటికి 43 మంది ఎమ్మెల్యేలతో అసలైన శివసేన తనదే అని చెప్పుకుంటున్న షిండేకు ఇపుడు ఎంపీలు కూడా మద్దతు ఇచ్చేలా సీన్ మారుతోంది. ఒక విధంగా ఆయన్నే శివసేనకు అసలైన లీడర్ గా కూడా అంతా చూస్తున్న సీన్ ఉంది. మొత్తం 56 మంది శివసేన ఎమ్మెల్యేలతో అరడజన్ తప్పించి 50 మంది దాకా తన వెంటే వస్తారు అని షిండే నిబ్బరంగా చెబుతున్నారు.

దాంతో ఆ మ్యాజిక్ ఫిగర్ చేరగానే ఆయన యాక్షన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇక ఇప్పటికే మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను కలసి తమదే అసలైన శివసేన అని కూడా షిండే చెప్పనున్నారు. ఆ తరువాత పరిణామాలను జోరెత్తించేందుకు కమలం పార్టీ తయారుగా ఉంది.

ఇక మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీకి కరోనా సోకడంతో ఆయన కోలుకునే వరకు మహారాష్ట్ర గవర్నర్‌ బాధ్యతలను గోవా గవర్నర్‌ శ్రీధరన్‌కు కేంద్రం అప్పగిస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే శివసేన చీలిక వర్గం పంట పండినట్లే. వారు నేరుగా గోవాకు షిఫ్ట్ అయి అక్కడే తమ బలాన్ని నిరూపించుకుంటారు. ఆ మీదట గవర్నర్ సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. ఇవన్నీ అట్టే టైమ్ లేకుండా రెండు మూడు రోజులలోనే స్పీడ్ గా సాగిపోతాయని అంటున్నారు.

బీజేపీకి చెందిన ఫడ్నవీస్ సీఎం గా డిప్యూటీ సీఎం గా ఏక్ నాధ్ షిండేతో కొత్త ప్రభుత్వం ఈ నెల 26న ప్రమాణం చేస్తుంది అని అంటున్నారు. ఇక కీలకమైన ఎనిమిది మంత్రిత్వ శాఖలతో పాటు పది నుంచి పదిహేను మంది దాకా శివసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడతారు అని తెలుస్తోంది.

అలాగే శివసేన రెబెల్ వర్గంలోకి వచ్చే ఎంపీలకు రెండు నుంచి మూడు పదవులకు కూడా బీజేపీ హామీ ఇచ్చింది అని అంటున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఉద్ధవ్ థాక్రే చేతులెత్తేశారు. పవార్ పాలిటిక్స్ కూడా ఏ మాత్రం పనిచేయడంలేదు, ఇక కాంగ్రెస్ ఇపుడు తనకు ఉన్న 44 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. బీజేపీ సర్కార్ ఏర్పడితే కాంగ్రెస్ ని సగానికి సగం చీల్చడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.