Begin typing your search above and press return to search.

మోడీ మీటింగ్ కు బైక్ మీద ఐదుగురు వచ్చినా ఫర్లేదట!

By:  Tupaki Desk   |   13 Oct 2019 5:29 AM GMT
మోడీ మీటింగ్ కు బైక్ మీద ఐదుగురు వచ్చినా ఫర్లేదట!
X
అరచేతిలో అంతులేని అధికారం ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటలు కొన్ని బాధ్యత గీతల్ని దాటేస్తుంటాయి. ఎన్నికల వేళ విజయం మాత్రమే గుర్తు పెట్టుకునే నేతలు.. ఆ దిశగా ఏం చేసైనా సరే.. తమకు అనుకూలంగా ఫలితాలు రావాలని తపిస్తుంటారు. ఇందులో భాగంగా కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకుంటారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇదే రీతిలో వ్యవహరించి విమర్శల పాలు కావటమే కాదు.. ఇప్పుడు న్యాయపరమైన సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు.

ఎన్నికల వేళ ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చేసే నేతలకు తగ్గట్లే వ్యవహరించారు మహారాష్ట్ర మంత్రి పరిణయ్. మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) మహారాష్ట్రలో ప్రధాని మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

తమ బిగ్ బాస్ ప్రచారానికి వస్తున్న వేళ.. భారీ ఎత్తున జనసమీకరణ మీద ఫోకస్ పెట్టిన బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ట్రాఫిక్ నిబంధనల్ని మరింత కఠినతరం చేయటం ద్వారా ప్రమాదాల్ని తగ్గించాలనుకునే తీరుకు భిన్నంగా ప్రధాని మోడీ సభను సూపర్ హిట్ చేయాలన్న తలంపుతో అత్యుత్సాహపు వ్యాఖ్యలు చేశారు.

రూల్స్ ను పట్టించుకోవద్దని.. టూ వీలర్ మీద ప్రధాని సభకు వచ్చే వారు ముగ్గురైనా వచ్చేయాలన్నారు. అవసరమైతే ఐదుగురైనా ఎక్కేయాలని.. పోలీసులు అడ్డుకుంటే తన పేరును చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా వదిలిపెట్టకుంటే.. తానే స్వయంగా వచ్చి విడిచిపెట్టేలా చేస్తానని మాట్లాడారు. సాకోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పరిణయ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా మంత్రి మాటల్ని బీజేపీ మిత్రుడు శివసేన సైతం తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలు క్షమించలేనివిగా స్పష్టం చేసింది. మరీ.. వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో?