Begin typing your search above and press return to search.

నాడూ నేడూ : ఎన్టీయార్ తో మొదలెట్టి...అలా బోర్డు మార్చేశారు!?

By:  Tupaki Desk   |   8 Oct 2022 10:06 PM IST
నాడూ నేడూ : ఎన్టీయార్ తో మొదలెట్టి...అలా బోర్డు మార్చేశారు!?
X
ఏపీలో ఏమి జరుగుతోంది అంటే పేరు కోసం పోరు అని సింపుల్ గా చెప్పాలేమో. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఎంతో ఘన చరిత్ర ఉన్న వారి ఖ్యాతిని లాగేసుకుని సర్కార్ ఖాతాలో కలిపేయడం. కాదూ కూడదనుకుంటే తమ వారి పేర్లతో స్టిక్కర్లు అతికించేయడం. ఇదే ఇపుడు జరుగుతోంది. నాడూ నేడూ అంటూ వైద్య రంగంలో చేస్తున్న మార్పులు ఎవరికీ తెలియడం లేదు కానీ నాడు ఆ పేరు ఉంటే నేడు ఈ పేరుగా మార్చేశారని మాత్రం సెటైర్లు పడుతున్నాయి.

ఇక విజయవాడ నడిబొడ్డున ఉన్న ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరుని మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టేసిన ప్రభుత్వానికి ఇపుడు జిల్లా ఆసుపత్రులు వాటికి ఉన్న ఘనమైన నామధేయాలు మార్చడం చిటికలో పనే అంటున్నారు. అలా పేరు మార్పు గాలి క్రిష్ణా జిల్లా నుంచి దూకుడుగా వచ్చి విజయనగరం తీరానికి చేరింది. అంతే దశాబ్దాలుగా ఉన్న విజయనగరం మహారాజుల పేరు రాత్రికి రాత్రే పోయింది. మహారాజా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు కాస్తా మారిపోయిన సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిగా మారిపోయింది.

నిజానికి ఈ ఆసుపత్రి వెనక గొప్ప చరిత్ర ఉంది. ఇది మహారాజులు స్థాపించారు. తమ భూమిని 22 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు. పూసపాటి రాజులు తమ సంపదను అంతా విద్యా వైద్య రంగాలకు ఖర్చు చేశారు. అయినా సరే వారు పేరు కోసం తాపత్రయపడలేదు. నాటి ప్రభుత్వాలే వారి గుర్తుగా మహారాజా అని పేరు పెట్టి కొనసాగిస్తున్నాయి తప్పితే ఏ ఒక్కరి పేరునో శాశ్వతంగా చేసి పెద్ద అక్షరాలతో రాయలేదు.

నిజానికి ప్రభుత్వానికి భూరి విరాళాలో భూ దానమో చేస్తే వారి కుటుంబీకుల పేరు పెట్టే సంప్రదాయమే కాదు నిబంధన కూడా ఉంది. కానీ దాన్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తోసి రాజని దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది తప్పు అని విపక్షాలు ఖండిస్తున్నా ఎక్కడా వెనక్కు తగ్గడంలేదు. కొన్ని పేర్లు సెంటిమెంట్. అవి జనం గుండెల్లో అలా ఉండిపోతాయి. ఈ రోజు బోర్డు మార్చినా సాదర జనం ముంచి ప్రతీవారూ మహారాజా ఆసుపత్రి అని అనకుండా ఉండగలరా.

సరే ఈ పేరు మార్పు వెనక వైసీపీ పెద్దల ఆలోచనలు వేరేగా ఉన్నాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ 12 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, దాని మీద కన్ను వేసే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఇక వైద్య కళాశాల ఏర్పాటు ఏర్పాటు అయ్యాక మరిన్ని సదుపాయాలు కల్పించాలని ప్లాన్ ఉందిట. అది మంచిచే ప్రభుత్వం చేయాల్సిందే. దాని కోసం మధ్యన మహారాజా వారు అడ్డు వచ్చారా అంటే మాత్రం జవాబు ఉండదేమో. లేక ఈ భూమిని పూర్తిగా ప్రభుత్వం తీసుకుని వేరే యాక్టివిటీ కోసం వాడుకోవడానికి ఈ పేరుని తొలగించారని కూడా విపక్షాలు అంటున్నాయి.

ఇది తుగ్లక్ చర్య అని చంద్రబాబు ఘాటైన విమర్శ చేస్తే లోకేష్ సైతం పేర్ల పిచ్చికి ఇది పరాకాష్ట అనేశారు. ఏది ఏమైనా రాజుల మీద ప్రభువులు పడ్డారని గతంలో మాన్సాస్ వ్యవహారంతో పాటు సింహాచలం ట్రస్టీ పదవి తీసేసి పూసపాటి రాజులను ఇబ్బంది పెట్టారని ఇపుడు ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రికి పేరు మార్చేసి తమ అక్కసు తీర్చుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే మహారాజా అన్న పేరు ఎక్కడా రికార్డులల్లో లేదని ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉంది కాబట్టి బోర్డు తిరగేయడంలో తప్పు లేదని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నిజానికి చూస్తే మహారాజా ఆసుపత్రి అని బయట తాటికాయంత అక్షరాలతో పేరు కనిపిస్తుంది అయినా లోపల రికార్డుల్లో లేవని పోలీసులు అంటున్నారు. శిలాఫలకంలో మహారాజా పేరు లేకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఉంది. అక్కడ భూమిలో ఉంది. సెంటిమెంట్ లో ఉంది. ఇవన్నీ మరచి అడ్డంగా వాదిస్తే మాత్రం అధికారంలో ఉన్న వారిని ఎవరూ ఇపుడు ఏమీ చేయలేరు. కానీ సరైన సమయంలో కాస్తా గట్టిగానే తమ తీర్పు మాత్రం చెబుతారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.