Begin typing your search above and press return to search.

గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ అరెస్ట్

By:  Tupaki Desk   |   30 Dec 2021 10:37 AM IST
గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ అరెస్ట్
X
మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్ ను రాయ్ పూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఖజురహోలో ఉన్న కాళీచరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ ధరమ్ సంసద్ కార్యక్రమంలో కాళీ చరణ్ మాట్లాడుతూ గాంధీజిని దూషించడంతోపాటు మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సేను ప్రశంసించాడు. రాయపూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు రాయ్ పూర్ లోని తిక్రపారా పోలీస్ స్టేషన్ లో కాళీచరణ్ మహారాజ్ పై కేసు నమోదైంది.

కాళీచరణ్ పై ఐపీసీ సెక్షన్ 505(2) సెక్షన్ 294 కింద పోలీసులు కేసు పెట్టారు. రాయ్ పూర్ లో కేసు నమోదు అయిన వెంటనే కాళీచరణ్ మహారాజ్ చత్తీస్ ఘడ్ నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.

కాళీచరణ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు పంపారు. రాయ్ పూర్ ధరమ్ సంసద్ లో మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హామీ ఇచ్చారు.

మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్ పై మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్ థానే నగరంలో పోలీస్ కేసు పెట్టారు. మతపరమైన భావాలను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా ద్వేషపూరితంగా వ్యవహరించడంతో పాటు ఇతర నేరాలకు పాల్పడినందుకు గాను కాళీచరణ్ పై కేసులు నమోదు చేశారు.