Begin typing your search above and press return to search.

మహా ట్విస్ట్ .. వారం సీఎం గా ఫడ్నవిస్ !

By:  Tupaki Desk   |   23 Nov 2019 10:15 AM GMT
మహా ట్విస్ట్ .. వారం సీఎం గా ఫడ్నవిస్ !
X
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మలుపులు తిరుగుతోంది. గత కొన్ని రోజులుగా అధికారంలో శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ లు చర్చల మీద చర్చలు పెడుతుంటే ..ఒకే ఒక్క రాత్రిలో కథ మొత్తం నడిపిన బీజేపీ , ఫడ్నవిస్ ని మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. గత శుక్రవారం సాయంత్రం వరకు కూడా శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అని అందరు అనుకున్నారు. కానీ , ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్‌ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో మహా రాజకీయం మరో మలుపు తిరిగింది.

ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. శనివారం ఉదయమే పరిస్థితి మారిపోయిందని, శనివారం ఉదయం 6.30కు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు నాకు తెలిసిందన్నారు. తమకు తెలియకుండానే అజిత్ పవార్ రాజ్ భవన్‌కు వెళ్లారని తెలిపారు. తమ మూడు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని శరద్ పవార్ తెలిపారు. అజిత్ ఉన్న ఎమ్మెల్యేలందరూ తమతో టచ్‌లో ఉన్నారన్నారు. అలాగే బీజేపీకి మద్దతిచ్చిన ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

అజిత్ పవార్ నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదని ఆయన స్పష్టం చేశారు. . అజిత్ పవార్ నిర్ణయం పార్టీకి పూర్తి విరుద్ధమని, పార్టీ క్రమశిక్షణను అజిత్ తప్పాడని ఆయన వ్యాఖ్యానిచారు. అజిత్ పవార్‌తో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని చెప్పారు. అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని శరద్ పవార్ తేల్చి చెప్పారు. అంతేగాక, నవంబర్ 30న దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే ఈ సమావేశంలో మాట్లాడిన కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యే లు అజిత్ పవార్ ఫోన్ చేసి రాజ్ భవన్‌కు రమ్మన్నారని చెప్పడం గమనార్హం. ఈ సమావేశానికి సేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్, ప్రపుల్ పటేల్ లు కూడా హాజరైయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.