Begin typing your search above and press return to search.

మాగుంట ఆత్మీయ విందు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   17 Dec 2021 2:00 PM IST
మాగుంట ఆత్మీయ విందు.. రీజ‌నేంటి?
X
వైసీపీ నాయ‌కుడు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీలోకి చేరి.. ఒంగోలు పార్ల‌మెంటు టికెట్‌ను సంపాయిం చుకుని పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి త‌ర‌చుగా.. ఏదొ ఒక కార‌ణంగా.. వార్త‌ల్లో ఉంటున్నారు. గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో వైసీపీ ఎంపీల‌ను పిల‌వ‌కుండా.. త‌న టీడీపీ మిత్ర ఎంపీల‌ను పిలుచుకుని ఆయ‌న పార్టీ ఇవ్వ‌డం .. అప్ప‌ట్లో తీవ్ర సంచల‌నం సృష్టించింది. ఇక‌, ఆ సెగ ఇంకా చ‌ల్లార‌క‌ముందే.. తాజాగా మ‌రోసారి ఆయ‌న ఢిల్లీ రాజ‌కీయ పెద్ద‌ల‌కు.. పార్టీల‌కు అతీతంగా పార్టీ ఇచ్చారు. మ‌రి దీనివెనుక ఏదైనా కార‌ణం ఉందా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్తల కుటుంబంగా పేరున్న మాగుంట‌.. గ‌తంలో కాంగ్రెస్ నుంచి ప‌లు ప‌ర్యాయాలు పార్ల‌మెంటు కు ఎన్నిక‌య్యారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీ పంచ‌న చేరిపోయారు. ఈ క్ర‌మంలో టీడీపీ టికెట్‌పై అప్ప‌ట్లోనే ఆయ‌న ఒంగోలు నుంచి పోటీ చేయ‌గా.. వైసీపీ స‌భ్యుడు, ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ వైవీసుబ్బారెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, దీంతో చంద్ర‌బాబు మాగుంట‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మాగుంట‌.. టీడీపీని వ‌దిలేసి.. వైసీపీ పంచ‌న చేశారు. ఈ క్ర‌మంలోనేఎంపీ టికెట్ తెచ్చుకుని గెలుపు గుర్రం ఎక్కారు.

అయితే.. పార్టీలో ఆయ‌న‌కు సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌తోనూ వివాదాలు ఉన్నాయ‌నే టాక్ త‌ర‌చుగా వినిపిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే.. తాజాగా గురువారం ఢిల్లీలోని త‌న కార్యాల‌యంలో మాగుంట‌.. పార్టీల‌కుఅతీతంగా.. 176 మంది సీనియ‌ర్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు ఆత్మీయ విందు ఇచ్చారు. దీనికి బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ నాయ‌కురాలు.. కేంద్ర మంత్రి మీనాక్షిలేఖి, ఎంపీలు.. శ‌ర‌ద్ ప‌వార్‌, దిగ్విజ‌య్ సింగ్‌, జైరాం ర‌మేష్‌, గిరీష్ బాప‌ట్‌, వైసీపీ లోక్‌స‌భ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మిథున్ రెడ్డి, మ‌నీష్ తివారీ, క‌ళ్యాణ్ బెన‌ర్జీ(తృణ‌మూల్ కాంగ్రెస్‌), మ‌హువా మైత్రా, రాజీవ్ ప్ర‌తాప్ రూడీ(కాంగ్రెస్‌) , ద‌యానిధి మార‌న్‌(డీఎంకే), కార్తి చిదంబ‌రం(కాంగ్రెస్‌), గోవా మాజీ సీఎం ఫ్రాన్సిస్కో వంటి వారు వ‌చ్చారు. అయితే.. ఈ మొత్తం ఎందుకు చేస్తున్నారు?. అంటే.. త‌న కుమారుడు.. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా ఎదుగుతున్న మాగుంట రాఘ‌వ‌రెడ్డిని పొలిటిక‌ల్‌గా ప్ర‌మోట్ చేయ‌డానికి చేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.