Begin typing your search above and press return to search.

ఒత్తిడికి చెక్ పెడుతున్న 'మ్యాజిక్' పుట్టగొడుగులు..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 8:03 AM GMT
ఒత్తిడికి చెక్ పెడుతున్న మ్యాజిక్ పుట్టగొడుగులు..!
X
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు. మనీ వేటలో పడి ఆరోగ్యాన్ని సైతం ఎవరూ లెక్కచేయడం లేదు. దీనికితోడు అందుబాటులో దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా చివరకు మనిషి మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనలో చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉన్నవారిని గమనించే ఉంటారు. వీరంతా కూడా సైకో థెరపీ లాంటి చికిత్సలు తీసుకుంటారు. దీని వల్ల కొందరిలో సత్ఫలితాలు రాగా మరి కొందరిలో మాత్రం ఎలాంటి ప్రభావం కన్పించలేదని చెబుతుంటారు. అయితే ఈ సమస్యకు లండన్ చెందిన కంపాస్ పాథ్ వేస్ అనే మెంటల్ హెల్త్ కేర్ కంపెనీ తాజాగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న 233 మంది రెండు గ్రూపులుగా విభజించి కొన్ని రోజులపాటు అధ్యయనం చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని ఆ సంస్థ వెల్లడించింది. వీరిలో కొందరికి సిలోసిబిన్ అనే మ్యాజిక్ పుట్టగొడులను 25 మిల్లీ గ్రాముల డోస్‌ చొప్పున మూడు వారాలపాటు ఇచ్చారు. మిగిలిన వారికి త‌క్కువ డోస్ ఇచ్చి వాళ్లలో వచ్చిన మార్పును గమనించారు.

ప్రతీరోజు 25 మి.గ్రా. సిలోసిబిన్ తీసుకున్న‌వారిలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు త‌గ్గినట్లు తమ పరిశోధనలలో గుర్తించినట్లు పేర్కొన్నారు. సిలోసిబిన్‌లోని సైకోయాక్టివ్ అనే పదార్థం ఎమోష‌న్స్‌ని కంట్రోల్ చేసి మెద‌డు భాగం మీద ప్ర‌భావం చూపిస్తుందని తెలిపారు. దీని వల్ల మనిషికి ఒత్తిడి ల‌క్ష‌ణాలు చాలా వరకు తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఇదే విషయాన్ని మెడిసిన‌ల్ జ‌ర్న‌ల్‌లో వ‌చ్చిన‌ ఒక అధ్యయనం కూడా చెబుతోంది. కాగా ఈ మ్యాజిక్ పుట్ట‌గొడుగుల ప‌రిశోధ‌న‌ మ‌ధ్య‌స్త ద‌శ‌లోనే ఉందని కంపాస్ పాథ్ వేస్ అనే మెంటల్ హెల్త్ కేర్ కంపెనీ పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి వ‌స్తే మాత్రం డిప్రెష‌న్ తో బాధపడుతున్న వారికి చాలా రిలీఫ్ లభించే అవకాశం ఉంటుందని ప‌రిశోధ‌కులు బలంగా నమ్ముతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.