Begin typing your search above and press return to search.

మ్యాగీని మళ్లీ తెచ్చేస్తారట

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:26 AM IST
మ్యాగీని మళ్లీ తెచ్చేస్తారట
X
నిబంధనలకు విరుద్ధంగా పేర్కొన్న రసాయనాలను మోతాదు మించి వాడారన్న ఆరోపణలపై రెండు నిమిషాల నెస్లే మ్యాగీని దేశంలో బ్యాన్ చేయటం తెలిసిందే. మ్యాగీ నిషేధంతో ప్రఖ్యాత నెస్లే కంపెనీ.. తొలిసారి భారత్ లో భారీగా నష్టాల్ని చవి చూసింది. మ్యాగీ వివాదం తర్వాత.. నెస్లే ఇండియాకు ఎండీగా వ్యవహరిస్తున్న ఎటైన్ బెనట్ ను వెనక్కి తీసుకెళ్లిన నెస్లే.. సరికొత్త భారత్ ఎండీని భారతదేశానికి చెందిన సురేష్ నారాయణన్ ను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది.

55 ఏళ్ల నారాయణ్ ఇప్పటివరకూ మనీలాలో నెస్లే టాప్ హోదాలో వ్యవహరించారు. మ్యాగీ వివాదంతో బ్రాండ్ ఇమేజ్ భారీగా దెబ్బ తినటంతో పాటు.. అత్యంత కీలకమైన భారత్ లో బిజినెస్ పెద్ద ఎత్తున ప్రభావం అవుతున్న నేపథ్యంలో..నారయణ్ మేజిక్ మీద నెస్లే నమ్మకం ఉంచింది. ఇప్పటికే పలు విజయవంతమైన ప్రాజెక్టుల్ని సమర్థంగా నిర్వహించిన నారాయణ్ కు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ కు ఎండీగా తీసుకురావటం మంచిదని భావించింది.

ఈ నిర్ణయం కొద్ది రోజుల కిందటే తీసుకున్నా.. శనివారమే ఆయన తన బాధ్యతల్ని అధికారికంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాగీ తయారీపై తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం బ్యాన్ లో ఉన్న మ్యాగీని మళ్లీ మార్కెట్ లోకి తసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందుకు తానేమీ ఎక్కువగా మాట్లాడనని.. ఈ కేసుపై తీర్పు.. సోమవారం బాంబే హైకోర్టు వెలువడించనున్న నేపథ్యంలో.. కోర్టు తీర్పు ఆధారంగా మ్యాగీ అమ్మకాల్ని త్వరలో భారత్ లో మరోమారు షురూ చేస్తామని పేర్కొన్నారు. నారాయణ్ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నారు..?