Begin typing your search above and press return to search.

మాగంటి గోపీనాథ్ మళ్లీ సైకిలెక్కుతారా?

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:02 PM GMT
మాగంటి గోపీనాథ్ మళ్లీ సైకిలెక్కుతారా?
X
హైదరాబాద్ లో సొంతపార్టీతో ఏమాత్రం సంబంధాలు మెంటైన్ చేయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆరెస్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే, వారిలో జూబ్లీహిల్సు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మళ్లీ సొంత గూటికి వస్తారన్న ప్రచారం ఒకటి కొత్తగా మొదలైంది. అసలు మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరినప్పుడే అంతా షాకయ్యారు. చంద్ర‌బాబుకు చాలా ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరొందిన ఈయ‌న కారెక్క‌డం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తాను అధికార పార్టీలో చేరాల్సిన పరిస్థితులన్నీ ఆయన చంద్రబాబుకు వివరించిన తరువాత పార్టీ మారారన్న వాదనా ఒకటుంది. అదంతా ఎలా ఉన్నా ఇప్పుడు మళ్లీ ఆయన సైకిలెక్కబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మాగంటి గోపీనాథ్ టీఆరెస్ లో చేరినా కూడా అక్కడ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. తాజాగా ఆయన కుడిభుజంగా చెప్పుకునే ప్ర‌దీప్ చౌద‌రి టీఆరెస్ నుంచి మళ్లీ తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ ట్ర‌స్టుభ‌వ‌న్లో తెలుగుదేశం తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన సంద‌ర్భంగా ప్ర‌దీప్ చౌద‌రి విలేక‌రుల‌తో మాట్లాడారు. టీఆర్ ఎస్‌ లో టీడీపీ నుంచి వ‌చ్చిన వారిని లెక్క చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. మంత్రుల‌కైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొర‌క‌డం లేద‌ని ఆరోపించారు. టీడీపీ నేత‌ల‌పై చూపుతున్న వివ‌క్ష కార‌ణంగానే.. తాను తిరిగి సొంత గూటికి వ‌చ్చాన‌ని తెలిపారు.

దీంతో మాగంటి గోపీనాథ్ కూడా మాతృపార్టీలో చేర‌తారా? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న టీడీపీలో చేరే ప్ర‌ణాళిక‌లో భాగంగానే.. ముందు జాగ్ర‌త్తగా త‌న కుడిభుజ‌మైన ప్ర‌దీప్ చౌద‌రిని పాత పార్టీకి పంపారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో ఆయన మాట్లాడారని.. ఒక్కరొక్కరుగా అనుచరులను మళ్లీ టీడీపీలోకి పంపించి ఆయన కూడా వచ్చేస్తారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా మాగంటితో దీనిపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరి మాగంటి ఒక్కరే వస్తారా లేదంటే మరికొందరు టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా వెనక్కొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా టీఆరెస్ లో చేరినా ఇటీవల ఆయనకు చెందిన భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఆయనకు ఎలాంటి సహకారం అందించలేదన్న అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.