Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా త‌ల‌సాని?

By:  Tupaki Desk   |   28 Sep 2015 9:55 AM GMT
కేసీఆర్ స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా త‌ల‌సాని?
X
గెలిచిన పార్టీ గోడ దూకేసి.. అధికార‌పార్టీ కండువాలు క‌ప్పుకొన్న ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు విధించాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించ‌టం.. ఆ పిటీష‌న్‌ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రించ‌టం తెలిసిందే. గోడ దూకిన ఎమ్మెల్యేల విష‌యం స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్ ఉన్న‌నేప‌థ్యంలో.. ఆయ‌న త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటార‌న్న ఆశాభావాన్ని హైకోర్టు వ్య‌క్తం చేసింది.

హైకోర్టు తీర్పుతో టీఆర్ ఎస్‌ వ‌ర్గాలు సంతోషించాయి. అయితే.. వారి ఆనందం కాసేపు కూడా నిల‌వ‌ని ప‌రిస్థితి. ఎందుకంటే.. త‌మ పార్టీ బొమ్మ మీద పోటీ చేసి గెలిచిన త‌ల‌సాని శ్రీనివాస్‌ యాద‌వ్ అధికార పార్టీలో చేరిపోవ‌ట‌మే కాదు.. తెలంగాణ స‌ర్కారులో మంత్రి అయిన వైనంపై తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

తాజాగా ఆ లేఖ‌పై రాష్ట్రప‌తి భ‌వ‌న్ స్పందించింది. ఆ లేఖ‌ను కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి పంపుతున్న‌ట్లుగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు తెలియ‌జేసిన‌ట్లుగా ఎమ్మెల్యే గోపీనాథ్ చెబుతున్నారు. హైకోర్టు తిర‌స్క‌ర‌ణ‌తో ఊర‌ట చెందిన టీఆర్ ఎస్ స‌ర్కారుకు.. ఇప్పుడు త‌ల‌సాని వ్య‌వ‌హారంపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ స్పందించి కేంద్ర‌ హోం శాఖ‌కు పంప‌టంపై మ‌ళ్లీ గుబులు రేపుతోంది. గోడ దూకిని వివిధ పార్టీల ఎమ్మెల్యే విష‌యంలో కంటే.. మంత్రి ప‌ద‌వి అప్ప‌గించిన త‌ల‌సాని వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌ల‌నొప్పి తెచ్చి పెట్ట‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

గెలిచిన పార్టీని విడిచి పెట్టి అధికార‌పార్టీలోకి చేర‌టం కొత్తేం కాకున్నా.. ఇలా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టం కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లైంది. త‌ల‌సాని అంశంపై రాజ్యాంగ సంస్థ‌లు సీరియ‌స్ గా దృష్టి సారిస్తే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌ల‌నొప్పులు ఖాయ‌మ‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.