Begin typing your search above and press return to search.

చిరుకి ఒక న్యాయం..బాబుకి మరో న్యాయమా?

By:  Tupaki Desk   |   18 Jan 2017 9:27 AM GMT
చిరుకి ఒక న్యాయం..బాబుకి మరో న్యాయమా?
X
రెండు రోజులుగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది టీడీపీ ఎంపీ మాగంటి బాబు స్టెప్పుల టాపిక్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టేజ్ పై అమ్మాయిలతో కలిసి ఈ ఎంపీగారు చిరుసాంగ్ కి వేసిన స్టెప్పులు హాట్ టాపిక్ గా మారిన సంగతి.. ఈ వ్యవహారంపై రకరకాల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై తనదైన సమర్ధన చేసుకున్నారట మాగంటి బాబు.

తాజాగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి "ఖైదీ నెంబర్‌ 150" సినిమాలో హీరోయిన్‌ కాజల్‌ తో కలిసి ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు స్టెప్స్ మరోసారి వెండితెరను ఒక ఊపు ఊపేశాయనడంలో సందేహం లేదు. అయితే.. తాజాగా తన డాన్సులపై స్పందించిన ఎంపీ మాగంటి బాబు, చిరు ప్రస్థావన తీసుకొస్తూ... "చిరంజీవి సినిమా కోసం మేకప్‌ వేసుకుంటారు కానీ తనకు మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదని.. చిరంజీవిలాగా తానుకూడా ఎంపీనే అని.. చిరు డాన్సులు చేస్తే ఒప్పు, తాను మాత్రం డాన్సులు చేస్తే తప్పా.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారట!

అయితే బాబు గారి లాజిక్ కు కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి. చిరంజీవా, బాలకృష్ణా అన్నది విషయం కాదు కానీ... సినిమా నటులుగా ఉంటూ తెరపై చేసే డాన్సులకు, ఎంపీగా ఉంటూ స్టేజ్ లపై చేసే రికార్డింగ్ డాన్సులకు తేడా లేదా అని ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి. రాజకీయ నాయకులయినా ఎవరైనా సినిమాల్లో చేస్తే ఎవరూ ఆక్షేపించరు కానీ, ఇలా వీది వేదికలపై మొదలుపెడితేనే కామెంట్ చేస్తారని చెబుతున్నారు. మాగంటి బాబు అయినా సరే విత్ మేకప్ ఆర్ వితౌట్ మేకప్ సినిమాల్లో చేస్తే ఎవరూ ఏమీ అనరు అన్న విషయం ఆయనకు మాత్రం తెలియదంటారా.. తప్పదు మరి సమర్ధన కదా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/