Begin typing your search above and press return to search.

మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలకు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   24 April 2016 7:16 AM GMT
మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలకు బంపర్ ఆఫర్
X
ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడం ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. ముఖ్యంగా ఏపీ - తెలంగాణల్లో భారీగా పెంచారు. అయితే, వీరిని తలదన్నేలా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే పింఛనును అసాధారణ రీతిలో పెంచింది. ఏకంగా 700 శాతం పెంచింది. దీంతో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు జాక్ పాట్ కొట్టినట్లయింది.

మధ్యప్రదేశ్ లో మాజీ సీఎంల పెన్షన్ ను 700 శాతం పెంచుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం నెలకు రూ. 26 వేలు పెన్షన్ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రులు ఇకపై రూ. 1.7 లక్షల పెన్షన్ అందుకోనున్నారు. పెన్షన్ భారీగా పెంచడంతో పాటు పలు ప్రత్యేక సౌకర్యాలనూ కల్పించేలా జీవోను విడుదల చేశారు.

మధ్యప్రదేశ్ కు ప్రస్తుతం సీఎంగా ఉన్న చౌహాన్ కు ముందు 17 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో చాలామంది దివంగతులు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ - బీజేపీ నేతలు ఉమాభారతి - కైలాశ్ జోషి - సుందర్ లాల్ పత్వా - బాబూలాల్ గౌర్ లు ఉన్నారు. తాజా నిర్ణయంతో వీరిలో కొందరు లాభపడనున్నారు. అయితే, మాజీ సీఎంలు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ మంత్రులుగా ఉంటే ఈ కొత్త పెన్షన్ వర్తించదట. ఆ లెక్క ప్రకారం ఉమాభారతి - బాబూలాల్ గౌర్ లకు ఇది వర్తించదు. ఉమాభారతి కేంద్రంలో జలవనరుల మంత్రిగా ఉండగా బాబూలాల్ గౌర్ మధ్యప్రదేశ్ లోనే హోం మంత్రిగా ఉన్నారు. దీంతో ఈ కొత్త పెన్షన్ వల్ల దిగ్విజయ్ సింగ్ - కైలాశ్ జోషి - సుందర్ లాల్ పత్వాలకు మాత్రం ప్రయోజనం చేకూరనుంది. కాగా ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వేతనం రూ. 2 లక్షలుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రులకు వారికి తేడా 30 వేలే కానుంది.