Begin typing your search above and press return to search.

అనూహ్యం: కరోనా వేళ కేబినెట్ విస్తరణ

By:  Tupaki Desk   |   21 April 2020 4:00 PM GMT
అనూహ్యం: కరోనా వేళ కేబినెట్ విస్తరణ
X
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది అధికార ముచ్చట.. గెలిపించిన కాంగ్రెస్ ను కూలదోసి మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చామన్న సంతోషాన్ని కూడా కరోనా వైరస్ బీజేపీ నేతలకు ఇవ్వలేకపోయింది. దీంతో ప్రమాణం చేసిన సీఎం మాత్రమే మధ్యప్రదేశ్ లో కరోనా కట్టడిపై సమీక్షలు చేస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ ‘ఏక్ సుల్తాన్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు మధ్యప్రదేశ్ కేబినెట్ ను విస్తరించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

మధ్యప్రదేశ్ లో పోయిన డిసెంబర్ లో తెలంగాణతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్య ప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి మనస్తాపం చెందిన యువ కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ కు తన ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు కూలింది.

సరిగ్గా మార్చి 23న ఆగమేఘాల మీద సీఎంగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ ప్రమాణం చేశారు. మార్చి 24 నుంచి దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో మంత్రివర్గాన్ని విస్తరించడానికి సమయం లేక తానొక్కడే ఇన్నాళ్లు కరోనా కట్టడి పై సమీక్షలు నిర్వహిస్తు వస్తున్నారు.

అంతపెద్ద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గం లేకపోవడం.. ఆరోగ్య - హోంశాఖ పోస్టులు ఖాళీగా ఉండడం.. శివరాజ్ సింగ్ ఒక్కరే సీఎంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు ఈ కరోనా వేళ తప్పనిసరి పరిస్థితుల్లో శివరాజ్ సింగ్ మంత్రివర్గాన్ని విస్తరించారు.

తాజాగా రాజ్ భవన్ లో గవర్నర్ టాండన్ చేతుల మీదుగా శివరాజ్ సింగ్ కేబినెట్ మంత్రులతో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులుగా నరోత్తమ్ మిశ్రా - కమల్ పటేల్ - మీనా సింగ్ - తులసి సిలావత్ - గోవింద్ సింగ్ రాజ్ పుత్ ప్రమాణం చేశారు.