Begin typing your search above and press return to search.

తెలంగాణ స్పీకర్ కు మరోసారి వడదెబ్బ

By:  Tupaki Desk   |   26 March 2016 4:55 AM GMT
తెలంగాణ స్పీకర్ కు మరోసారి వడదెబ్బ
X
ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పటమే కాదు..ఎండ తీవ్రతకు వీవీఐపీలు సైతం అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజల పిట్టల్లా రాలిపోతున్న దుస్థితి తెలిసిందే. గడిచిన కొద్దిరోజులకే ఎండ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య 40కు చేరుకోవటం ఆందోళనకు కలిగించే అంశం.

ఇదిలా ఉంటే.. తాజాగా వడదెబ్బ బాధితుడిగా మారారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. గత ఏడాది వేసవిలోనూ వడదెబ్బ తిన్న ఆయన.. తాజా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగటం గమనార్హం. వరంగల్ జిల్లా రేగొండ మండలంలో జరిగిన రెండు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి హాజరైన స్పీకర్.. అదే జిల్లాలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. చిట్యాలలోని ఆసుపత్రికి సంబంధించిన భూమిపూజలోపాల్గొన్న ఆయన.. ఉన్నట్లుండి కళ్లు తిరుగుతున్నట్లుగా చెప్పటంతో వెంటనే ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

బీపీ.. సుగర్ పరీక్షలు చేసిన వైద్యులు వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆయన్ను తరలించే ప్రయత్నంలో పరకాలలో మళ్లీ మరోసారి కళ్లు తిరుగుతున్నట్లు చెప్పటంతో పరకాల లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వడదెబ్బకు గురైనట్లుగా వైద్యులు గుర్తించి చికిత్స నిర్వహిస్తున్నారు. వీవీఐపీలు కాస్తంత ఎండపట్టున తిరిగితేనే ఇలా అస్వస్థతకు గురి అవుతున్నారంటే.. సామాన్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.