Begin typing your search above and press return to search.

'మాధ‌వ‌రం' గెలుపులో చిరు!..వైర‌ల్ ఫ్యాక్ట్స్‌!

By:  Tupaki Desk   |   3 Jan 2019 2:57 PM GMT
మాధ‌వ‌రం గెలుపులో చిరు!..వైర‌ల్ ఫ్యాక్ట్స్‌!
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏ త‌ర‌హా వ్యూహాలు అమ‌లులోకి వ‌స్తాయో - ఆ వ్యూహాలకు ప‌దును పెట్టే వారు ఎవ‌ర‌న్న విష‌యంపై అంత త్వ‌ర‌గా స్ప‌ష్ట‌త రాదు. అయితే ఆ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం వైరి వ‌ర్గాల‌తో పాటు అనుకూల వ‌ర్గాలు - చివ‌ర‌కు ఓట‌ర్లు కూడా షాక్ తింటారు. అచ్చంగా ఇలాంటి ఘ‌ట‌నే మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి చోటుచేసుకుంది. ఆ ఘ‌ట‌న ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో ఆగ్ర‌హావేశాల‌ను ర‌గిలిస్తుండ‌గా - టీఆర్ ఎస్ వ‌ర్గాల‌తో పాటు ఓ సినీ ప్ర‌ముఖుడి అభిమానులు మాత్రం త‌మ స‌త్తా ఏమిటో వైరి వ‌ర్గానికి తెలిసి వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. ఈ ఉపోద్ఘాతాల‌ను ఇక పక్క‌న ప‌డేసి అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే.... తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏకంగా త‌న పార్టీ సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి... ఏ పార్టీకి వ్య‌తిరేకంగా అయితే టీడీపీ పుట్టిందో అదే కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టారు. మ‌హా కూట‌మి పేరిట రంగంలోకి దిగిన చంద్ర‌బాబు వ్యూహాల‌ను మాత్రం తెలంగాణ ప్ర‌జ‌లు ఛీత్క‌రించార‌నే చెప్పాలి.

తెలంగాణ ఆవిర్భవించిన త‌ర్వాత జ‌రిగిన‌ తొలి ఎన్నిక‌ల్లో టీడీపీకి 15 సీట్లు వ‌స్తే... ఈ ద‌ఫా ఆ సంఖ్య రెండంటే రెండుకు ప‌డిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే... టీడీపీకి చెందిన దివంగ‌త నేత‌ - మాజీ ఎంపీ - సినీ న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ ఫ్యామిలీని కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దించేసి ల‌బ్ధి పొందుదామ‌నుకున్న చంద్ర‌బాబు య‌త్నాలు పూర్తి స్థాయిలో బెడిసికొట్టాయి. హ‌రికృష్ణ మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబంలోని వ్య‌క్తిని బ‌రిలోకి దించుదామ‌న్న వ్యూహంలో భాగంగా హ‌రికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని... టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కూక‌ట్‌ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హా కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించారు. క‌మ్మ సామాజిక ఓట్లు అధికంగా ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సుహాసిని గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కేన‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా సుహాసినిని ఏకంగా 41 వేల ఓట్ల తేడాతో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావు మ‌ట్టి క‌రిపించారు. గెలుపు ఓకే గానీ... మ‌రీ ఇంత మెజారిటీ రావ‌డం వెనుక కార‌ణం ఏమిట‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు జ‌రిగినా... ఇప్ప‌టిదాకా వాస్త‌వాలు వెలుగులోకి రాలేదు.

అయితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ పార్టీలో మాధ‌వ‌రం కృష్ణారావు క‌లిసిన ఓ ప్ర‌ముఖుడి ఫొటోను చూసిన జ‌నం... ముక్కున వేలేసుకున్నారు. కృష్ణారావు క‌లిసిన వ్య‌క్తి ఎవ‌రంటే... కాంగ్రెస్ పార్టీలో మొన్న‌టిదాకా స్టార్ క్యాంపెయినర్‌ గా కొన‌సాగిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవే. న్యూ ఇయ‌ర్ పార్టీలో భాగంగా చిరును క‌లిసిన కృష్ణారావు... త‌న గెలుపున‌కు తోడ్ప‌డినందుకు మెగాస్టార్‌ కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అయినా కూక‌ట్‌ ప‌ల్లిలో మెగా స్టార్ ప్ర‌భావం అంత‌గా ఉందా? అన్న విష‌యానికి వ‌స్తే... ఓ వైపు టీడీపీ సానుభూతిప‌రులు - క‌మ్మ సామాజిక ఓట్ల‌న్నీ సుహాసినికే బ‌దిలీ అయినా... పార్టీ ప‌రంగా టీఆర్ఎస్ ఓట్ల‌న్నీ కృష్ణారావుకు ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో ఆ ప్రాంతంలోని కాపు ఓట్ల‌న్నీ టీఆర్ ఎస్ ఖాతాలో ప‌డే విధంగా మెగాస్టార్ మంత్రాంగం నెరిపార‌ట‌. టీఆర్ ఎస్ ఓట్ల‌కు కాపు ఓట్లు కూడా తోడు కావ‌డంతో కృష్ణారావు బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు. చిరు ప్ర‌యోగించిన ఈ బ్రహ్మాస్త్రం... అటు టీడీపీ నేత‌, సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు - ఇటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగేలా చేసింద‌ట‌. మొత్తంగా చిరు ప్ర‌యోగించిన అస్త్రం... కూక‌ట్ ప‌ల్లిలో టీడీపీని కూక‌టివేళ్ల‌తో పెకిలించేసింద‌న్న మాట‌.