Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ పోలీస్‌ గా మారిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:42 AM GMT
ట్రాఫిక్ పోలీస్‌ గా మారిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే
X
ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీస్‌ గా మారిపోయారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విప‌రీతంగా ఉన్న ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేసేందుకు ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డంతో పాటు అక్క‌డ ట్రాఫిక్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌గు సూచ‌న‌లు చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క ప్రాంతాల్లో ఎందుకు ట్రాఫిక్ జాం అవుతుందో తెలుసుకునేందుకు దాదాపు నాలుగు గంట‌ల పాటు ఆయ‌న రోడ్ల‌మీదే అధికారుల‌తో క‌లిసి చ‌క్కెర్లు కొట్టారు. ఇంత‌కు ఆ ఎమ్మెల్యే ఎవ‌రు ? ఆ సంగ‌తేంటో ? చూద్దాం.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లోని కూక‌ట్‌ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాధ‌వ‌రం కృష్ణారావు కూక‌ట్‌ ప‌ల్లిలోని ప‌లు ప్రధాన ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అక్క‌డ ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. అధికారుల‌ను వెంట‌పెట్టుకుని ఆయ‌న ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. గుంత‌లు ప‌డిన రోడ్ల‌ను పూడ్చాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఇక మ‌లేషియా టౌన్ షిఫ్ నుంచి వివేక‌నంద‌న‌గ‌ర్‌ కు వెళ్లేదారిలో సాయంత్రం టైంలో ఎందుకు ట్రాఫిక్ జాం అవుతుందో ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు ఆయ‌న నాలుగు గంట‌ల‌పాటు ట్రాఫిక్‌ ను స్వ‌యంగా ప‌రిశీలించి... ట్రాఫిక్ కంట్రోల్‌ కు సూచ‌న‌లు చేశారు. కృష్ణారావు చ‌క‌చ‌కా న‌డుస్తుంటే ఆయ‌న వెంట అధికారులు కూడా ప‌రుగులు తీశారు. అన్ని ఏరియాల్లోను ట్రాఫిక్ సిగ్న‌ల్స్ ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ఆదేశించ‌గా...నిధుల కొర‌త ఉంద‌ని అధికారులు చెప్ప‌డంతో ఆయ‌న అప్ప‌టిక‌ప్పుడే రూ.20 ల‌క్ష‌లు మంజూరు చేశారు.

అలాగే రోడ్ల‌కు ప‌డిన గుంత‌ల‌కు మ‌ర‌మ్ముతులు చేసేందుకు రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేసిన ఆయ‌న నిజాంపేట్‌ - మియాపూర్ వెళ్లే వాహ‌నాల‌ను వ‌సంత‌న‌గ‌ర్ వైపు మ‌ళ్లీంచేందుకు గాను...ఆ రోడ్డుకు మ‌ర‌మ్మ‌తులు చేసేందుకు మ‌రో రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేశారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని - పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని వాహ‌న‌దారుల‌కు కూడా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. రోడ్ల‌పై వెళుతున్న వారి నుంచి కూడా ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు స‌ల‌హాలు ఉన్నాయా అని అడిగి మ‌రీ తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్వ‌యంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై దృష్టి సారించ‌డంతో ఐటీ ఉద్యోగులు - విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఇక ఇక్క‌డ ట్రాఫిక్ విష‌యాన్ని సీఎం కేసీఆర్‌ - మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ‌తాన‌ని చెప్పారు. ట్రాఫిక్ జాం కాకుండా తీసుకోవాల్సిన‌ - పాటించాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న అంద‌రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇక‌పై తాను ఈ ప్రాంతంలో ప్ర‌తివారం విజిట్ చేస్తాన‌ని చెప్పారు.