Begin typing your search above and press return to search.

ఆ మాటలకు అర్థమేంది ‘కృష్ణారావు’?

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:02 AM GMT
ఆ మాటలకు అర్థమేంది ‘కృష్ణారావు’?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిచ్చి మరీ.. తెలంగాణ అధికారపక్షంలో చేరిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్ పల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన్ను కాపాడుకునేందుకు చంద్రబాబు చాలానే ప్రయత్నాలు చేశారు. అధినేత అతృతను అర్థం చేసుకున్న ఆయన.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని.. తెలంగాణ అధికారపక్షం తనకు ఎర వేసినా తాను పడనని భరోసా ఇచ్చేవారని చెబుతారు.

అలాంటి ఆయన వన్ ఫైన్ మార్నింగ్.. గులాబీ కండువాను కప్పుకొని తమ్ముళ్లకు షాక్ ఇచ్చేశారు. మాధవరం కృష్ణారావు పార్టీ మారటం ఖాయమని తెలిసినా.. మరీ అంత త్వరగా మారతారని ఊహించలేదు. పార్టీ మారటమైతే మారారు కానీ.. ఆయన అంత సంతోషంగా లేరన్నది తాజా టాక్. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ టీఆర్ ఎస్ లో లేదంటూ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పార్టీ మారిన తర్వాత.. అవకాశం ఉన్నా.. లేకున్నా.. పాత పార్టీని ఉతికి ఆరేసే నేతలకు భిన్నంగా మాధవరం వ్యవహరించటం చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీ తనకు సొంతిల్లు లాంటిదని.. టీఆర్ ఎస్ లో తాను సర్దుకోవటానికి కొంత టైం పడుతుందని ఆయన చెబుతున్నారు. మాధవరం మాటలు వింటే పెద్దగా ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారినట్లుగా కనిపించక మానదు. మరీ.. అంత ఇబ్బంది పడుతూ పార్టీ మారాల్సిన అవసరం ఏమిటో..? నచ్చి చేరిన టీఆర్ ఎస్ సొంతిల్లుగా మాధవరానికి ఎప్పటికి అనిపిస్తుందో..? మరి.. ఆ లోటు తీరాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకోవాలా? లేక.. కాలమే దానికి బదులు చెబుతుందా?