Begin typing your search above and press return to search.

మాదాపూర్ లో సోదాలు..ఏపీ పోలీసుల ఎంట్రీ..ఏమిటీ వివాదం?

By:  Tupaki Desk   |   3 March 2019 4:50 AM GMT
మాదాపూర్ లో సోదాలు..ఏపీ పోలీసుల ఎంట్రీ..ఏమిటీ వివాదం?
X
స‌రికొత్త వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. టీడీపీకి ఐటీ సేవ‌లు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాల‌యంలో సైబ‌రాబాద్ పోలీసులు శ‌నివారం సాయంత్రం సోదాలు నిర్వ‌హిచారు. మాదాపూర్ లోని అయ్య‌ప్ప సొసైటీలో ఉన్న కార్యాల‌యంలో త‌నిఖీలు నిర్వ‌హించి.. కొన్ని హార్డ్ డిస్క్ లు.. ల్యాప్ టాప్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే..ఈ ఉదంతంపై స‌మాచారం అందుకున్న గుంటూరు పోలీసులు హుటాహుటిన మాదాపూర్ కు చేరుకున్నారు. దీంతో.. ఈ వ్య‌వ‌హారం రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదంగా మారింది.

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవ‌లు అందిస్తున్న సేవామిత్ర మొబైల్ యాప్ లో ఏపీకి చెందిన 3 కోట్ల మంది ఓట‌ర్ల జాబితా ఉంద‌న్న‌ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌.. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఆరోప‌ణ‌. దీనికి సంబంధించి ఇప్ప‌టికే సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఒక ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో మాదాపూర్ అయ్య‌ప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌పై కేసు న‌మోదు చేశారు.

ఈ కంపెనీ టీడీపీకి యాప్ త‌యారు చేసి ఇచ్చింద‌ని.. అందులో ఓట‌ర్లు.. వారి ఆధార్ కార్డుల వివ‌రాల‌తో పాటు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్థిదారుల స‌మాచారం ఉంద‌న్న‌ది విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ప్ర‌తి ఒక్క టీడీపీ కార్య‌క‌ర్త‌కు ఈ స‌మాచారం అంతా అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది ఆయ‌న వినిపిస్తున్న వాద‌న‌.మ‌రోవైపు ఇదే కంపెనీకి చెందిన కూక‌ట్ ప‌ల్లిలో మ‌రో కంపెనీ నుంచి వివ‌రాలు సేక‌రించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుమ్మ‌ల లోకేశ్వ‌ర‌రెడ్డి మ‌రో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు 2012లో జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం ఏ రాజ‌కీయ పార్టీ కూడా ఫోటోల‌తో కూడిన ఓట‌ర్ల జాబితాను ఉంచుకోకూడ‌ద‌ని.. ఇందుకు విరుద్ధంగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న‌ది జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ స‌మాచారంతోనే టీడీపీ నేత‌లు 2014లోని ఓట‌రు జాబితాలో ఉన్న పేర్ల‌ను 2019లో తొల‌గించిన‌ట్లుగా వారు చెబుతున్నారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యాల‌యంలో శ‌నివారం త‌నిఖీలు నిర్వ‌హించారు. సంస్థ ప్ర‌తినిధుల్లో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ల్యాప్ టాప్ లు.. హార్డ్ డిస్క్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. స‌ద‌రు ఐటీ కంపెనీపై కేసు న‌మోదు చేశామ‌ని.. ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ వెల్ల‌డించ‌టంతో పాటు.. స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు.. ఈ విష‌యాల్ని తెలుసుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన మాదాపూర్ లోని స‌ద‌రు ఐటీ కంపెనీ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ఈ కంపెనీలో ప‌ని చేస్తున్న భాస్క‌ర్ రావు అదృశ్య‌మ‌య్యారంటూ కుటుంబ స‌భ్యులు పెదకాకానిలో పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని.. దీంతో రంగంలోకి దిగిన గుంటూరు అర్బ‌న్ పోలీసులు ఆయ‌న హైద‌రాబాద్ లో ఉన్న‌ట్లు గుర్తించి త‌నిఖీల నిమిత్తం వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. రెండు రాష్ట్రాల‌కు చెందిన పోలీసులు ఒకే వ‌ద్ద‌కు చేరుకోవ‌టంతో క‌ల‌క‌లం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు భాస్క‌ర్ ను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా హైద‌రాబాద్ పోలీసులు వెల్ల‌డించారు. త‌మ‌కు అందిన ఫిర్యాదు అంశం మీద విచార‌ణ జ‌రిపి అనంత‌రం ఏపీ పోలీసుల‌కు అప్ప‌గిస్తామ‌ని చెప్ప‌టంలో ఏపీ పోలీసుల బృందం వెన‌క్కి వెళ్లారు. శ‌నివారం అర్థ‌రాత్రి వేళ చోటు చేసుకున్న ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. రెండు రాష్ట్రాల్లోని పోలీసు వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.