Begin typing your search above and press return to search.

చలితో వణికిపోతున్న ఢిల్లీ..119 ఏళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత!

By:  Tupaki Desk   |   31 Dec 2019 6:11 PM IST
చలితో వణికిపోతున్న ఢిల్లీ..119 ఏళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత!
X
ఢిల్లీ లో రోజురోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. దీనితో గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్న ఏకంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత కనిష్టంగా ఉష్ణోగ్రత నమోదు కావడం గత 119 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. సఫ్దర్ జంగ్లో ఈ టెంపరేచర్ నమోదైనట్టు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్ మెంట్ ట్వీట్ చేసింది. 1901 తర్వాత డిసెంబర్లో అతి తక్కువ టెంపరేచర్ నమోదుకావడంలో ఇదే తొలిసారని ఐఎండీ రికార్డులు చెప్పాయి. అయనగర్ లో 7.8 - రిడ్జ్ లో 8.4 - పాలంలో 9 - లోడిలో 9.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైనట్టు ఐఎండీ వర్గాలు చెప్పాయి.

అయితే , రోజురోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రత ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పొగమంచులోని కాలుష్య కారకాల వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు - గుండెపోటు - న్యుమోనియా - ఆస్థమా - హైపర్ టెన్షన్ వంటి వాటితో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాగే ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ లైట్లు వేసుకుని రోడ్లపైకి వెహికిల్స్ నడపాల్సిన పరిస్థితి వచ్చింది. పొగమంచు వల్ల రైళ్లు - విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టూడెంట్స్ - ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు, పొగమంచు కారణంగా నిన్న 530 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 20 విమానాలను దారి మళ్లించగా, నాలుగింటిని రద్దు చేశారు. ఇక - రైళ్లు అయితే - 2 నుంచి ఏడు గంటలు ఆలస్యంగా నడిచాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో నోయిడాలోని పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఉష్ణోగ్రత మైనస్ 11.8 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న దాల్‌ లేక్‌ లోని నీరు గడ్డకట్టుకుపోతోంది. దీంతో పడవలు సాఫీగా నడపలేకపోతున్నారు. అయితే ప్రకృతి సౌందర్యం పర్యాటకులకు కనువిందు చేయనుంది.