Begin typing your search above and press return to search.

వణికించే కరోనా వైరస్ వేళలోనూ పెళ్లి చేసుకున్నారు

By:  Tupaki Desk   |   3 Feb 2020 10:30 AM GMT
వణికించే కరోనా వైరస్ వేళలోనూ పెళ్లి చేసుకున్నారు
X
ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న వేళ.. చైనాకు చెందిన అమ్మాయి.. భారత్ కు చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారింది. బతికితే చాలురా భగవంతుడా? అనుకుంటున్న వేళ.. తమ ప్రేమను పెళ్లికి అప్ గ్రేడ్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అందుకోసం వారు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావని చెప్పాలి. వణికిస్తున్న కరోనా వైరస్ వేళ.. చైనా యువతి.. ఆమె తల్లిదండ్రులు భారత్ కు రావటానికి పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. అయినప్పటికి వారిద్దరి ప్రేమ ముందు కరోనా భయం వెనకడుగు వేయక తప్పలేదు. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకున్నదంటే..

మధ్యప్రదేశ్ లోని మాందసౌర్ లో చోటు చేసుకున్న ఈ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారింది. చైనాకు చెందిన జిహావో వాంగ్.. భారత్ కు చెందిన సత్యార్థ మిశ్రా ఐదేళ్ల క్రితం కెనడాలో కలిసి చదువుకున్నారు. వారి మధ్య స్నేహం.. ప్రేమగా మారి చివరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎట్టకేలకు పెద్దల్ని ఒప్పించి పెళ్లికి రెఢీ అయ్యారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోవాలని ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు.

ఇదంతా బాగున్నా.. అనుకోని పిడుగు మాదిరి తెర మీదకు వచ్చిన కరోనా వైరస్ తో చైనా నుంచి భారత్ కు రావటం కష్టంగా మారింది. చైనా నుంచి వచ్చే వారికిచ్చే ఈ-వీసాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో.. జిహానో కుటుంబసభ్యులు భారత్ కు వెళ్లటానికి భారత అధికారులు నో చెప్పారు. వీసా ఇవ్వలేమన్నారు. అయితే.. విషయం మొత్తం చెప్పటంతో అధికారులు ఓకే చెప్పారు. అయితే.. ఒక కండీషన్ పెట్టారు. వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి.. కరోనా వైరస్ వారికి లేదని తేలిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని చెప్పారు.

దీంతో.. వారు అన్ని పరీక్షలు చేసుకోవటం.. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలటంతో వారు మాందసౌర్ కు చేరుకున్నారు. ఇరు కుటుంబాలు.. బంధువులు చేరి వారి వివాహాన్ని వేడుకగా జరిపారు. వైద్య పరీక్షలకు తాము ఇబ్బంది పడలేదని.. తామున్న ప్రాంతానికి కరోనా వైరస్ వ్యాపించలేదని వారు చెబుతున్నారు. తమ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు అనుమతించిన అధికారులకు వారు థ్యాంక్స్ చెప్పటమే కాదు.. తమ కుమార్తె పెళ్లి అయిపోయింది కాబట్టి మళ్లీ తమ దేశానికి వెళ్లిపోతామని వధువు తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.