Begin typing your search above and press return to search.

కృష్ణానది వరదలో 132 లారీలు ఎలా చిక్కుకుపోయాయి?

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:00 AM GMT
కృష్ణానది వరదలో 132 లారీలు ఎలా చిక్కుకుపోయాయి?
X
తెలుగు.. హిందీ సినిమాల్లో కనిపించని కొన్నిసీన్లు.. హాలీవుడ్ మూవీల్లో కనిపిస్తుంటాయి. విపత్తు ఒక్కసారిగా విరుచుకుపడటం.. అప్పటివరకు అంతా బాగున్నట్లుగా ఉండి.. విరుచుకుపడే ఉపద్రవానికి సంబంధించిన సీన్లు తీయటంలో హాలీవుడ్ తర్వాతే ఎవరైనా. అప్పటివరకు మామాలూగానే ఉండే చోట.. ఒక్కసారిగా ఉపద్రవం విరుచుకుపడటం చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి రీల్ సీన్ ఒకటి రియల్ గా దర్శనమిచ్చింది. దీంతో.. ఎప్పుడూ చూడని రేర్ సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది.

తాజాగా కృష్ణానది వరదలో 132 లారీలు.. ఐదు ట్రాక్టర్లు చిక్కుకుపోయిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అప్పుడప్పడు హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్ మాదిరే.. ఇప్పుడు నీటిలో మునుగుతున్న లారీలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? నీటి ప్రవాహాన్ని చూసినంతనే లారీలు ఒడ్డుకు వచ్చే వీలుంటుంది కదా? అలా ఎందుకు జరగలేదు? లాంటి సందేహాలు చాలానే వచ్చే పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ర్యాంపుకు ఇసుక లోడింగ్ కోసం వెళ్లిన 132 లారీలు.. ఐదు ట్రాక్టర్లు వరద నీటిలో చిక్కుకుపోయిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. లారీల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉన్న 150 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటంతో భారీ ప్రాణనష్టం త్రుటిలో తప్పిందని చెప్పాలి. ఇంతకూ ఇసుక ర్యాంప్ లో వరద నీరు ఈ స్థాయిలో ఎందుకు వచ్చినట్లు? అన్నది కీలకంగా మారింది. ప్రత్యక్ష సాక్ష్యలు అందించిన సమాచారం ప్రకారం చూస్తే.. ఇసుక రవాణాకు కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లో లోడింగ్ కోసం ఎప్పటిలానే పెద్ద ఎత్తున లారీలు వెళ్లాయి.

శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇసుక లోడింగ్ పనులు మహా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటివేళ.. అనుకోని పరిణామం చోటు చేసుకుంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇటీవల దెబ్బతిన్న గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేయటం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వను పెంచారు.గేట్ ట్రయల్ రన్ పూర్తి అయిన క్రమంలో కొన్ని రిపేర్లు.. నిర్వహణ నిమిత్తం ప్రాజెక్టులోని నీటిని ఒక మీటరు ఎత్తును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో.. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ నీరు చెవిటికల్లు ర్యాంపు వద్దకు చేరుకుంది. ఈ నీరు దిగువకు చేరటానికి కొన్ని గంటల ముందే లారీల్ని నది నుంచి తీసుకు వెళ్లాల్సిందిగా అధికారులు చెప్పినట్లుగా కొందరు.. చెప్పలేదని మరికొందరు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఇసుక లోడింగ్ కు రెండు కిలోమీటర్ల ర్యాంపుపై నదిలోకి వచ్చిన లారీలు తిరిగి వెళ్లే వేళలో ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యిందని.. దీంతో లారీలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీంతో.. ర్యాంపు పై ఉన్న లారీలు తప్పుకునే వీలు లేకపోవటంతో.. లారీల్ని వరుసగా నిలిపివేయాల్సి వచ్చింది.

ఇదే సమయంలో ఎగువ నుంచి వచ్చిన నీరు ర్యాంపును ముంచెత్తింది. దీంతో.. లారీలు మునిగిన పరిస్థితి. అధికారుల ముందుచూపుతో నాటుపడవలతో గజ ఈతగాళ్ల సాయంతో.. పడవల్ని దింపి.. లారీల్లోని డ్రైవర్లు.. క్లీనర్లను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. వరద తీవ్రత ఎక్కువ అవుతుండటంతో లారీలు నదిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కష్ణానదిలో వరద ఉధతి పెరిగుతుందన్న ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

కంచికచర్ల తహశీల్దార్‌ రాజకుమారి నిర్లక్ష్యమే తమ కొంప ముంచిందని లారీ యజమానులు వాపోతున్నారు. అయితే.. తహశీల్దార్‌ వాదన మరోలా ఉంది. 75వేల క్యూసెక్కుల నీరు ఇసుక రీచ్ వైపుకు వచ్చే అవకాశం లేదని.. కొద్దిరోజుల క్రితం వచ్చిన వరద కారణంగా నీటి ప్రవాహ దిశ మార్చుకుందని..దీంతో ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. 75 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్న సమాచారం చెప్పలేదని రెవెన్యూ యేతర అధికారులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ముందే అలెర్టు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదంటున్నారు. మొత్తంగా చూస్తే.. అధికారుల నిర్లక్ష్యం.. సమన్వయ లోపం తాజా పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.